ఫోన్లు, టీవీలకు అతుక్కునే పిల్లలకు తొందరగా మాటలొస్తలేవ్ !

ఫోన్లు, టీవీలకు అతుక్కునే పిల్లలకు తొందరగా మాటలొస్తలేవ్ !
  • అతిగా స్క్రీన్‌ చూసే చిన్నారులపై ఎఫెక్ట్‌
  • గంటల తరబడి చూస్తే భాష రావడం కష్టమే 
  • వాళ్లతో పేరెంట్స్ ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అయితే అంత మంచిగా మాటలొస్తయ్
  • ఇంటర్నేషనల్ స్టడీలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పిల్లాడు ఏడుస్తున్నాడని చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టడం, అన్నం తింటలేడని టీవీలో  కార్టూన్లు పెట్టి తినిపించడం.. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా ఇదే పరిస్థితి. కానీ, ఇలా చేస్తే మీ పిల్లల భవిష్యత్తును మీరే రిస్క్‌‌లో పెడుతున్నట్టేనని రీసెంట్ రీసెర్చ్ హెచ్చరిస్తున్నది. చిన్న వయసులో అతిగా స్క్రీన్ చూసే పిల్లల్లో మాటలు రావడం ఆలస్యమవుతున్నదని, కొత్త పదాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతున్నదని ఇంటర్నేషనల్ జర్నల్ ‘క్యూరియస్‌‌’లో పబ్లిష్ అయిన స్టడీలో తేలింది.

ఈ స్టడీలో ప్రపంచవ్యాప్తంగా పిల్లల స్క్రీన్ టైమ్, వారి మానసిక ఎదుగుదలపై వచ్చిన వందలాది రీసెర్చ్‌‌లను పరిశీలించారు. అందులో 8 స్టడీలను ఎంపిక చేశారు. 3 నుంచి 6 ఏండ్ల వయసున్న వేలాది మంది పిల్లలు, వారి తల్లిదండ్రుల డేటాను విశ్లేషించి.. పిల్లలకు మాటలు ఆలస్యంగా రావడానికి అధిక స్క్రీన్ టైమే కారణమని తేల్చారు. 

స్క్రీన్లకు అతుక్కుపోతున్న పిల్లలు..  
రోజుకు సగటున గంటన్నర నుంచి రెండున్నర గంటల పాటు (1.39 -నుంచి 2.65 గంటలు) పిల్లలు స్క్రీన్లకు అతుక్కుపోతున్నట్టు స్టడీలో తేలింది. పిల్లలు ఒంటరిగా కూర్చుని టీవీ, ఫోన్‌‌లో వీడియోలు చూస్తుంటే.. వాళ్ల మెదడులో భాషను గ్రహించే భాగం మొద్దుబారుతున్నదని గుర్తించారు. ఎదుటివారితో మాట్లాడే అవకాశం లేకపోవడమే దీనికి కారణమని తేల్చారు. స్క్రీన్ టైమ్ ఎక్కువైన కొద్దీ.. పిల్లలు నేర్చుకునే కొత్త పదాల సంఖ్య తగ్గిపోతున్నదని, ఇది ఫ్యూచర్‌‌‌‌లో వారి చదువుపై, సోషల్ లైఫ్‌‌పై దెబ్బ కొడుతుందని హెచ్చరించారు.

చిన్నారులు డిజిటల్ బేబీ సిట్టర్‌‌‌‌లాగా మారితే.. పూర్తిగా మాటలే రాకపోవచ్చునని పరిశోధకులు హెచ్చరించారు. పిల్లలతో ఎంత ఎక్కువ మాట్లాడితే, వాళ్లు అంత త్వరగా మాటలు నేర్చుకుంటారని స్పష్టం చేశారు. 18 నెలల లోపు పిల్లలకు అసలు స్క్రీన్ చూపించొద్దని, 2 నుంచి 5 ఏండ్లలోపు పిల్లలకు రోజుకు గంటకు మించి స్క్రీన్ టైమ్ ఉండకూడదని సూచించారు. పిల్లలు ఏం చూస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని.. కేవలం టైమ్‌‌పాస్ వీడియోలు కాకుండా, నాలెడ్జ్ పెంచే వాటిని ఎంచుకోవాలన్నారు. 

ఇంటరాక్టివ్ లెర్నింగ్ బెటర్..
సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులతో, తోటి పిల్లలతో మాట్లాడటం ద్వారానే భాషను నేర్చుకుంటారు. కానీ ఫోన్లకు అతుక్కుపోవడం వల్ల ఆ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ మిస్ అవుతున్నది. వీడియోలో బొమ్మలు కదులుతుంటాయి గానీ, పిల్లలు తిరిగి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. దీంతో మెదడులో భాషను ప్రాసెస్ చేసే శక్తి మందగిస్తున్నది. ఫలితంగా వయసు పెరిగినా స్పష్టంగా మాట్లాడలేకపోవడం, తక్కువ వకాబులరీ (పదాలు) కలిగి ఉండటం వంటి సమస్యలు వస్తున్నాయని స్టడీలో తేలింది.

అయితే, స్క్రీన్ టైమ్ అంతా చెడ్డదేమీ కాదని కూడా ఈ స్టడీ పేర్కొంది. పిల్లలు చూసేది కేవలం కార్టూన్లు కాకుండా.. అక్షరాలు నేర్పించేవి, ప్రశ్నలు అడిగే ఎడ్యుకేషనల్ యాప్స్ అయితే కొంత మేలు జరుగుతుందని తెలిపింది. పిల్లల చేతిలో ఫోన్ పెట్టి వదిలేయకుండా.. తల్లిదండ్రులు కూడా పక్కన కూర్చుని, ఆ వీడియోలో ఏముందో వివరిస్తూ, పిల్లలతో మాట్లాడితే.. స్క్రీన్ టైమ్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చని పేర్కొంది.