వలసలు ఆపేదెట్ల?

వలసలు ఆపేదెట్ల?

ప్రపంచం మొత్తం మీద ఇండియాలోనే వలస వచ్చినోళ్లు ఎక్కువమంది ఉన్నారు. వివిధ దేశాల ప్రజలకు మన దేశమే అన్ని విధాలా సేఫ్​ ప్లేస్​లా కనిపిస్తోంది. దీంతో కొన్ని దేశాలవాళ్లు పద్ధతి ప్రకారం రెఫ్యూజీలుగా ఇక్కడికి వస్తుంటే… మరికొన్ని దేశాలవాళ్లు దొడ్డిదారిన దూరిపోతూ ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా ఇల్లీగల్​గా వస్తున్నోళ్లకు చెక్​ పెట్టడానికే ఎన్నార్సీ, సీఏఏ లాంటివి తెరపైకి వస్తున్నాయి. అయితే, అవి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాయా?

ప్రశాంతంగా బతకటానికి ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల లేని అనుకూల పరిస్థితులు ఇండియాలో ఉన్నాయి. మన దేశం కీలకమైన, వ్యూహాత్మక స్థానంలో ఉండటం​;​ ఉపాధి పరంగా ఏదో ఒకటి దొరికే పరిస్థితి ఉండడం; ఆర్థికంగా రిచ్​ కాకపోయినా ఇబ్బందులు లేనిది కావటం​; పొరుగు దేశాలతో స్నేహపూర్వకంగా సాగుతుండటం​; స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండటం… ఇలా ఏ విధంగా చూసినా మన దేశం వలస వచ్చే జనాలకు చాలా అనువుగా ఉంది. దీంతో వివిధ దేశాల ప్రజలు ఇండియాకి అయస్కాంతంలా అతుక్కుపోతున్నారు.

ముఖ్యంగా ఆసియా ఖండంలోని టిబెట్​, అఫ్ఘానిస్థాన్​, శ్రీలంక, మయన్మార్​, పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ తదితర దేశాలవాళ్లు భయమూ, బెదురు లేని లైఫ్​కోసం మన దేశాన్ని షెల్టర్​లా భావిస్తున్నారు. పాకిస్థాన్​, బంగ్లాదేశ్​ కాకుండా మిగతా నాలుగు దేశాల నుంచి ఒక పద్ధతిగా ఇండియాకి వచ్చిపోతుంటారు. ఎటొచ్చీ బంగ్లాదేశ్​తోనే బాగా చిక్కొచ్చి పడింది.​ ఆ దేశం నుంచి ఇల్లీగల్​గా మన దేశంలో ప్రవేశించి ఉండిపోవటంతో  సమస్యలు ఎదురవుతున్నాయి.

వాళ్లతో ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు!

అక్రమంగా వలసవస్తున్నవాళ్లు పెరుగుతుంటే స్థానికులు నీరు, నేల వంటి ప్రకృతి వనరులతోపాటు అన్ని రకాలా నష్టపోతున్నారు. జాతీయ భద్రతకు ఆటంకాలు వస్తున్నాయి. ఈశాన్య​ రాష్ట్రాల్లో జనాభా మధ్య లెక్కలు మారిపోతున్నాయి. బయటివాళ్లు పైచేయి సాధించే ప్రమాదం ఉందని స్థానికులు​ ఫీలవుతున్నారు. ఇది వారి లైఫ్​ స్టయిల్​పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాదు, రెండు వర్గాల మధ్య తరచుగా గొడవలకూ దారి తీస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అసంతృప్తికి ఆజ్యం పోస్తోంది.

ఇల్లీగల్​ ఇమ్మిగ్రెంట్స్​కి స్మగ్లర్లు తోడవుతున్నారు. పశ్చిమ బెంగాల్​ సరిహద్దు​లోని ఇనుప కంచెని దాటుకుని, చడీ చప్పుడు లేకుండా మన దేశంలోకి జంప్​ చేస్తున్నారు.  జవాన్ల కన్నుగప్పి ప్రవేశించే ముఠాలు  సరుకుల్ని​, పశువుల్ని, మేకలు గొర్రెల్ని పొలిమేర దాటిస్తున్నారు. బంగ్లాదేశ్​ సరుకులపై మన సర్కారు విధించే దిగుమతి పన్నుల్ని తప్పించుకోవటానికి  తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. బంగ్లాదేశ్​ నుంచి అమ్మాయిలను మన దేశంలోకి తీసుకొస్తూ ప్రాస్టిట్యూషన్​ను పెంచి పోషిస్తున్నారు.

వలసలను ఆపే చట్టాలు, కట్టుబాట్లు లేవా?

సమస్య పరిష్కారానికి ‘ఇల్లీగల్​ మైగ్రెంట్స్​ (డిటర్మినేషన్​ బై ట్రిబ్యునల్​) యాక్ట్​’ని 1983లో పార్లమెంట్​ ఆమోదించింది. కానీ, ఆ చట్టం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవటంతోపాటు న్యాయపరమైన సవాళ్లు ఎదురవటంతో సుప్రీం కోర్టు 2005లో పక్కన పెట్టింది. ఇల్లీగల్​ మైగ్రేషన్​ అంశాన్ని మన దేశం బంగ్లాదేశ్​తో రాజకీయం​గా, దౌత్యపరంగా చాలాసార్లు ప్రస్తావించింది. అయినా అటు నుంచి చెప్పుకోదగ్గ స్పందన రాలేదు. బంగ్లా సరిహద్దులో ఫెన్సింగ్​ వద్ద చెక్​పోస్టులు పెంచినప్పటికీ కప్పదాట్లను కట్టడి చేయలేకపోయింది.

విదేశాల నుంచి వస్తున్న రెఫ్యూజీలకు మన దేశం ఎప్పటినుంచో పెద్దఎత్తున ఆశ్రయం కల్పిస్తున్నా దానికి సంబంధించి ఎలాంటి చట్టాలూ లేవు.  శరణార్థులు లేదా అక్రమ వలసదారులను వేర్వేరుగా చూడడం లేదు. ఎవరినైనా ‘ఫారినర్​’గానే పరిగణిస్తోంది. ఇండియన్​ సిటిజన్​ కాని వ్యక్తి ఎవరైనా విదేశీయుడే అంటోంది.  అలా అని మన దేశానికి రెఫ్యూజీ పాలసీ ఏదీ లేదనటం కూడా సరికాదు.

ఢిల్లీలో యూఎన్​హెచ్​సీఆర్​ ఆఫీసు

ఇండియాలో ఆశ్రయం కోరుకునేవారు ఢిల్లీలోని ఐక్యరాజ్య సమితి రెఫ్యూజీ హైకమిషనర్​ ఆఫీసుకి వెళితే చాలు… మన దేశం రెఫ్యూజీ స్టేటస్​ ఇచ్చేస్తోంది. బంగ్లాదేశ్​లో బాధలు పడలే క ఇండియాకి రావాలనుకునే నాన్​–ముస్లిం వలస ప్రజలకు ఆటంకంగా మారింది. ఆ లోటును ఇప్పుడు సీఏఏ తీర్చనుంది. అస్సాంలోని ఇల్లీగల్​ మైగ్రెంట్స్​ని ఎన్నార్సీ ఏరేస్తుంది. అయితే ఈ సమస్యను ఆ రెండూ శాశ్వతం​గా తీర్చగలవా అనే సందేహాలు వస్తున్నాయి.

వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులు 

అస్సాం : ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది ఇల్లీగల్​ బంగ్లాదేశీయులు ఉన్నట్లు అంచనా. ఇక్కడ స్థానిక ముస్లింలూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దీంతో అక్రమం​గా చొరబడ్డ బంగ్లాదేశీ హిందూ ముస్లింలను, బెంగాలీ మాట్లాడే స్థానికులను విడివిడిగా గుర్తించటం కష్టమవుతోంది. బంగ్లాదేశీయులు ఇక్కడ రేషన్​, ఓటర్, ఆధార్​ కార్డులు, బ్యాంక్​ అకౌంట్లు పొందినట్లు తెలుస్తోంది.దీంతో అసలైన ఇండియన్​ పౌరులు వివక్షకు గురవుతున్నారు.

ఢిల్లీ : ఈ రాష్ట్రంలోకి దాదాపు 40 వేల మంది ఇల్లీగల్​ బంగ్లాదేశీయులు, రోహింగ్యా ముస్లింలు వచ్చినట్లు అంచనా. వారి వల్ల జాతీయ భద్రతకు, సమైక్యతకు రిస్క్​ ఎదురవుతోంది. వాళ్లందరినీ స్వదేశాలకు పంపించేయాలంటూ కొందరు గతంలో సుప్రీంకోర్టులో పిల్​ వేశారు. ఈ నేపథ్యంలో 500 మందిని గుర్తించి వెళ్లగొట్టినట్లు ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకి చెప్పారు.

హర్యానా : నేషనల్​ కేపిటల్​ రీజియన్ (ఎన్సీఆర్)​లో ఆరేడు లక్షల మంది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు​ అక్రమం​గా ఉన్నట్లు అంచనా. ముఖ్యంగా గుర్​గావ్​, ఫరీదాబాద్​, నుహ్ ​(మెవాత్​ రీజియన్)తోపాటు చాలా పట్టణాల్లోని శివారు గ్రామీణ ప్రాంతాల్లో వీళ్లు ఉన్నట్లు చెబుతున్నారు.  నకిలీ హిందూ ఐడెంటిటీ సంపాదించి ఉంటున్నారు. అలాంటివాళ్లను గట్టిగా నిలదీస్తే… పశ్చిమ బెంగాల్​ నుంచి వచ్చినట్లు అబద్ధాలాడుతున్నారు.

జమ్మూ కాశ్మీర్ ​:  రోహింగ్యా అక్రమ ఇమ్మిగ్రెంట్స్​ ప్రధానంగా జమ్మూ ప్రాంతంలో ఉన్నారు. వీరి పట్ల స్థానిక ప్రజానీకం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. రోహింగ్యా ముస్లింల కారణంగా జమ్మూలోని డెమొగ్రాఫిక్స్​ మారిపోతాయన్న భయం ఏర్పడింది. అక్కడ హిందువులు మెజారిటీ సంఖ్యలో ఉంటారు. అక్రమ వలసలవల్ల మెజారిటీ ప్రజల లెక్కల్లో మార్పులు చోటు చేసుకునే ప్రమాదం ఉంది.  జమ్మూలో రోహింగ్యా ముస్లింలు ఉండటాన్ని సెక్యూరిటీ కోణంలో చాలా జాగ్రత్తగా చూడాలని సూచిస్తున్నారు ఎనలిస్టులు.

కేరళ : బంగ్లాదేశ్​కి 2,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాష్ట్రంలోకికూడా అక్రమంగా ప్రవేశిస్తున్నారు. అన్​స్కిల్డ్, సెమీస్కిల్డ్​ లేబర్​కి అక్కడ ఎక్కువ రాబడి ఉండటమే కారణం. ఇల్లీగల్​గా వచ్చేవాళ్లకు అప్పటికప్పుడే ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. దాంతో ఈ వలసల వెనక ఉన్న అసలువాళ్లను పట్టుకోవటానికి ఎంత  ప్రయత్నించినా లాభం ఉండడం లేదు.

మిజోరం : రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో బంగ్లాదేశీ బుద్ధిస్ట్​ చక్మాలు ఎక్కువ. బంగ్లాదేశ్​లోని కర్ణాఫులి నదిపై 1962లో కప్తాయ్​ డ్యామ్​ కట్టడంతో వీళ్లంతా ఇళ్లు, పొలాలు కోల్పోయి మిజోరంలోకి వచ్చేశారు. ఈ ఆనకట్ట వల్ల 655 స్క్వేర్​ కిలో మీటర్ల మేర వరదలు ముంచెత్తాయి. పునరావాసం కల్పించకపోవటంతో లక్ష మందికి పైగా చక్మాలు వలస బాట పట్టారు.

తెలంగాణ : సౌత్​ ఇండియా మొత్తం మీద హైదరాబాద్​లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. అయినా ఇక్కడ రోహింగ్యాలకు, బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్లకు అంత సులభంగా చోటు దొరకదు. తెలంగాణలోని రాజకీయ​ పార్టీలుకూడా ఇల్లీగల్​ ఇమ్మిగ్రెంట్స్​ని ఓటు బ్యాంకుగా భావించట్లేదు. అయితే, ఇక్కడికి డైలీ వేజ్​ వర్కర్లుగా వస్తున్న వలసదారుల సంఖ్య మాత్రం ఏటా పెరుగుతోంది.

త్రిపుర : బంగ్లాదేశీయులు అక్రమ మార్గాల్లో వరదలా వస్తుంటారు. దాంతో ఈ రాష్ట్రంలో స్థానికుల సంఖ్య  మారిపోతోంది. రాజకీయ​, సోషియో–ఎకనామిక్​ కండిషన్లు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. 1971లో పాకిస్థాన్​ నుంచి విడిపోయి బంగ్లాదేశ్​ ఏర్పడినప్పటి నుంచి ఈ వలసలు పెరిగాయి. ఫలితంగా 1951లో 59.1 శాతంగా ఉన్న స్థానిక గిరిజన జనాభా… 2011 నాటికి 31.1 శాతానికి తగ్గిపోయింది.

ఉత్తరప్రదేశ్ ​: ఇల్లీగల్​ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు యూపీలోని చాలా నగరాల్లో ఉంటున్నట్లు చెబుతున్నారు. వీళ్లంతా సరైన పాస్​పోర్ట్​, అధికారిక​ డాక్యుమెంట్లు లేకుండానే యూపీకి వచ్చేసి సెటిలైపోతున్నారు. తమ ఐడెంటిటీని, పేర్లను మార్చేసుకుంటారు. దాంతో వాళ్లపై నిఘా వేసి, వాళ్ల నేపథ్యాన్ని చెక్​ చేయటం కష్టంగా మారింది. ఫేక్​ ఐడెంటిటీతో మథుర, బృందావన్​, గోవర్ధన్ తదితర ప్రాంతాలతోపాటు ఇతర ప్రదేశాల్లోని ఆశ్రమాల్లో, అద్దె ఇళ్లలో తలదాచుకుంటున్నారు.

పశ్చిమ బెంగాల్: బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్స్​ కొన్నేళ్లుగా నందిగ్రామ్​ సహా గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల సెటిలవుతున్నారు. లోకల్​ లెఫ్ట్​ లీడర్ల సాయంతో చిన్న కమతాల్ని సాగు చేసుకొంటూ బతుకుతున్నారు. బెంగాల్​లో భూముల రెగ్యులేషన్​ చాలా తక్కువ. చాలామంది దగ్గర తామే భూముల యజమానులమని రుజువు చేసుకునే డాక్యుమెంట్లు లేవు. అదీగాక, రూపు రేఖలు, వేషభాషలు తూర్పు, పశ్చిమ బెంగాలీ ప్రజల మధ్య పెద్దగా తేడా లేకపోవడంకూడా ఒక కారణం. అక్రమ వలసల సమస్యపై సైలెంట్​గా ఉంటున్న రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది పశ్చిమ బెంగాల్​ మాత్రమే.

ఏ దేశంవాళ్లు ఎంతమంది?

బంగ్లాదేశ్​ నుంచి మన దేశంలోకి దొంగ దారుల్లో ప్రవేశించినవాళ్ల సంఖ్య 2.4 కోట్లకు చేరినట్లు అంచనా.

మిజోరం, ఢిల్లీల్లో అక్రమంగా ఉంటున్న మయన్మార్​ దేశంవాళ్లు సుమారు 50 వేల నుంచి లక్ష మంది.

అఫ్ఘానిస్థాన్ నుంచి చొరబడినవాళ్లు 2009లోనే 13 వేలు దాటింది. ఇప్పుడింకా పెరిగి ఉండొచ్చు.

పాకిస్థానీయులు పదేళ్ల క్రితమే 7,700 మంది వరకు ఇండియాలో ఇల్లీగల్​గా ఉన్నట్లు తేలింది. వారిలో ఎక్కువ మంది హిందువులు, సిక్కులే. వాళ్లంతా సిటిజెన్​షిప్​ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు.

రోహింగ్యాలు వేల సంఖ్యలో వేర్వేరు దారుల్లో సెక్యూరిటీ కళ్లు గప్పి మన దేశంలోకి ఎంటరవుతున్నారు. మయన్మార్​కి చెందిన  రోహింగ్యాలు… అస్సాం, పశ్చిమ బెంగాల్​, జమ్మూకాశ్మీర్​, ఢిల్లీ వంటి చోట్ల 40 వేల పైనే ఉంటారని భావిస్తున్నారు.

ఇంకా ఏమేం చేయాలి?

ప్రత్యేకంగా ‘నేషనల్​ రెఫ్యూజీ లాస్​’ రూపొందించాలి.

సెన్సిటివ్​ ఏరియాల్లో ఇమ్మిగ్రెంట్స్​ కదలికలపై తగిన ఆంక్షలు పెట్టాలి.

బంగ్లాదేశ్​తో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలి.

రెండు దేశాల మధ్య రాకపోకలు సాగించేవారిపై ఉమ్మడి వెరిఫికేషన్​ ఉండాలి.

ఇలాంటి ఇష్యూలను పరిష్కరించే యూఎన్​హెచ్​సీఆర్, ఐఓఎంల సూచనలు, సలహాలు తీసుకోవాలి.