పిల్లలు అబద్దమాడితే ఇలా చేయండి

పిల్లలు అబద్దమాడితే ఇలా చేయండి

కొంతమంది పిల్లలు హోమ్‌‌వర్క్ చేయకుండానే అయిపోయిందని, చాక్లెట్ తిని... తినలేదని ఈజీగా అబద్ధాలు ఆడుతుంటారు. అది చూసి పేరెంట్స్ కోప్పడతారు. లేదా పనిష్‌‌మెంట్ ఇస్తుంటారు. అయితే అబద్ధాలు ఆడే పిల్లలతో తెలివిగా ఉండాలంటున్నారు డాక్టర్లు. వాళ్లని  ఎలా డీల్ చేయాలో సైకాలజిస్ట్ క్రిస్టన్ ఈస్టమన్​ వివరించారిలా.. 

* పిల్లలకు అబద్ధాలు ఆడడం అలవాటుగా మారితే  అది భవిష్యత్తులో చాలా ప్రమాదంగా మారొచ్చు. వాళ్లు నిజాయతీగా ఉండాలంటే ముందు పెద్దవాళ్లు వాళ్లతో నడుచుకునే విధానాన్ని మార్చుకోవాలి. అబద్ధాలు ఆడినప్పుడు తిట్టడం, కొట్టడం లాంటివి చేయకూడదు. అంతేకాదు పిల్లలతో తల్లిదండ్రులు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు.  

* పిల్లలు కావాలని అబద్ధాలు చెప్పరు. వాళ్ల అబద్ధాల వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. అందుకే ముందుగా పిల్లలు ఏయే సందర్భాల్లో అబద్ధాలు చెప్తున్నారో గమనించాలి. హోంవర్క్‌‌ చేయకుండానే చేశాను అని చెప్తుంటే వాళ్లకు హోమ్‌‌వర్క్ చేయడం ఇష్టం లేదని అర్థం. అలాంటప్పుడు హోంవర్క్ ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోవాలి. కష్టంగా అనిపిస్తున్న సబ్జెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టేలా పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. 

* పిల్లల్లో ఉండే ఆత్మన్యూనత కూడా వాళ్లతో అబద్ధాలు ఆడిస్తుంది. అందుకే తరచుగా అబద్ధాలు ఆడేపిల్లలకు ఏవైనా ఇబ్బందులు, భయాలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. వాళ్లతో సున్నితంగా మాట్లాడి, వాళ్లకున్న భయాలు, ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేయాలి. అలా చేస్తే  పిల్లలకు అబద్ధాలు ఆడే అవసరం రాదు.

* కొందరు పేరెంట్స్ పిల్లలతో మరీ స్ట్రిక్ట్​గా ఉంటుంటారు. అలాంటి పేరెంట్స్ నుంచి తప్పించుకునేందుకు కూడా పిల్లలు అబద్ధాలు ఆడుతుంటారు. అలా భయంతో అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఆ భయం పోగొట్టే ప్రయత్నం చేయాలి. పిల్లలతో ప్రేమగా, సున్నితంగా మాట్లాడడాన్ని పేరెంట్స్ అలవాటు చేసుకోవాలి.

* తాము చెప్పేది వినాలన్న కోరికతో కూడా చాలామంది పిల్లలు కట్టుకథలు చెప్తుంటారు. ఇలాంటి పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వాలి.  అలాచేస్తే వాళ్లకున్న తాపత్రయాన్ని తగ్గించొచ్చు. వాళ్లు ఏది చెప్పినా ఓపికగా వింటుండాలి. ఇలా చేయడం ద్వారా వాళ్లకు అబద్ధాలు ఆడే అవసరం తగ్గుతుంది.

 * ఈ జాగ్రత్తలన్నింటితో పాటు పిల్లలకు అబద్ధాలు ఆడడం వల్ల జరిగే నష్టాలను కథల రూపంలో అర్థమయ్యేలా చెప్పాలి. ఏదో ఒక ఉదాహరణ తీసుకుని అబద్ధం చెప్పడం వల్ల జరిగే నష్టం గురించి చెప్పాలి. ఎలాంటి సందర్భంలోనైనా నిజం చెప్పేవాళ్లే నిజమైన హీరోస్ అని వివరించాలి.