
ఆఫీసులో కొలీగ్స్‌తో కలిసి తింటున్నా.. బంధువుల ఇంటికి భోజనానికి లేదా రెస్టారెంట్‌కు వెళ్లినా.. కొందరి ఈటింగ్ హ్యాబిట్స్ పక్కన వాళ్లకి ఇబ్బందిగా ఉంటాయి. దానివల్ల వాళ్లు ఎదుటివాళ్లపై ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు. అలా కాకూడదంటే.. టేబుల్ మ్యానర్స్ గుర్తుపెట్టుకోవాలి. తినేటప్పుడు ఎలా ఉండాలి? ఎలా తినాలి చెప్పడమే టేబుల్ మ్యానర్స్ . బయటే కాదు ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద తింటున్నా టేబుల్ మ్యానర్స్ ఫాలో అవ్వాలి.
- తిన్న తర్వాత మూతి, చేతులు తుడుచుకోవడానికి మాత్రమే నాప్కిన్ లేదా టిష్యూలు వాడతారు మనలో చాలామంది. కానీ, తినేటప్పుడు పెదాలకు, నోటి చివర్లకు మెతుకులు, కూరలు అంటుతుంటాయి. ఇలాంటప్పుడు నాప్కిన్తో ఎప్పటికప్పుడు మూతిని తుడుచుకోవాలి. అలాగే తినేటప్పుడు తుమ్మినా, దగ్గినా నాప్కిన్ లేదా టిష్యూ అడ్డుపెట్టుకోవాలి. రెస్టారెంట్ లేదా హోటల్‌కి వెళ్లినప్పుడు అన్నం మెతుకులు మీద పడకుండా వళ్లో నాప్కిన్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే పొరపాటున తినే పదార్థం వళ్లో పడినా డ్రెస్‌కి మరక కాదు.
- నలుగురితో కలిసి తింటున్నప్పుడు.. సౌండ్ చేస్తూ ఫుడ్ నమలకూడదు. అలాగే ఫుడ్ కారంగా ఉందని ఉసుళ్లు కొట్టినా ఎబ్బెట్టుగా ఉంటుంది పక్కనవాళ్లకి. నోటి నిండా అన్నం ఉన్నప్పుడు మాట్లాడితే ఎదుటివాళ్లపై మెతుకులు లేదా తుంపర్లు పడే అవకాశం ఉంది. అందుకని నోరంతా తెరిచి ఫుడ్ నమిలే అలవాటు ఉంటే మానేయాలి. చిన్న చిన్న పోర్షన్స్ తినాలి. రెస్టారెంట్స్‌లో తినేటప్పుడు టేబుల్ మీద మోచేతులు పెట్టకూడదు. ఇతరుల ప్లేట్‌లోనూ చేతులు పెట్టకూడదు. వడ్డించుకునేందుకు గరిటెలు మాత్రమే వాడాలి. రకరకాల ఐటమ్స్‌ని మిక్స్ చేసి తినే అలవాటు ఉంటే గనుక నలుగురితో ఉన్నప్పుడు ఆ అలవాటుని పక్కనపెట్టాలి.
- డైనింగ్ ఏరియాలో టూత్ పిక్స్‌ని వాడకూడదు. అలాగే వాడిన నాప్కిన్స్, టిష్యూస్ టేబుల్, కుర్చీల మీద పెట్టొద్దు. అలాగే నీళ్లు తాగేటప్పుడు కూడా గటగటమంటూ శబ్దం చేయొద్దు. ఒకవేళ అందరూ ఒకటే వాటర్ బాటిల్ వాడుతుంటే... నోటికి కరిచిపెట్టి తాగకూడదు. ఎంగిలి చేత్తో ఫుడ్ ఐటమ్స్‌ని పక్కనవాళ్లకి ఇవ్వొద్దు. చాలామందికి తినే పదార్థాలు వాసన చూసే అలవాటు ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు అలాంటి అలవాటు మంచిది కాదు. టేబుల్‌పై నీళ్లు, కూరలు పడకుండా వడ్డించుకోవడం కూడా టేబుల్ మ్యానర్సే.