
బిజినెస్ డెస్క్, వెలుగు: హఠాత్తుగా హాస్పిటల్ ఖర్చులు రావడం, పెళ్లి లేదా ఇంటి రిపేర్ వంటి పనులకు పెద్ద మొత్తం కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది చూసేది పర్సనల్ లోన్వైపే! దీంతో భారీగా డబ్బు చేతికి వస్తుంది. నెలానెలా కిస్తీల్లో కట్టొచ్చు కాబట్టి సులువుగా అప్పు తీరుతుంది. అయితే అన్నింటి కంటే ముఖ్యం పర్సనల్ లోన్‌ను తక్కువ వడ్డీకి తీసుకోవడం. వడ్డీ తక్కువ అయితే కట్టే కిస్తీ మొత్తం తగ్గుతుంది. అయితే అన్ని బ్యాంకులూ పర్సనల్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజులు, లోన్ డిస్బర్స్మెంట్ ఫీజులను వసూలు చేస్తాయి. మీరు తక్కువ వడ్డీరేటుకు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే ఈ జాగ్రత్తలు పాటించండి.
మీ క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోండి
పర్సనల్ లోన్‌పై తక్కువ వడ్డీ రేటును పొందడానికి క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడం చాలా ముఖ్యం. లోన్‌కు అప్లై చేసే ముందే స్కోర్ బాగుండేలా చూసుకోవాలి. అధిక క్రెడిట్ స్కోర్ వల్ల పర్సనల్ లోన్‌పై తక్కువ వడ్డీ రేటును పొందే అవకాశం ఉంది. స్కోర్ బాగుంటే బ్యాంక్ మిమ్మల్ని తక్కువ రిస్క్ ఉన్న వారిగా చూస్తుంది. పర్సనల్ లోన్ ఎటువంటి పూచీ లేకుండా ఇస్తారు కాబట్టి బారోవర్ల క్రెడిట్ స్కోర్ బాగుండటం ముఖ్యమని సహజ్‌మనీ ఫౌండర్ అభిషేక్ కుమార్ అన్నారు. మీ క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించాలి. మీరు ఇతర లోన్‌ల కిస్తీలను కూడా క్లియర్ చేయాలి. పేమెంట్ హిస్టరీ బాగుంటే, బ్యాంకులతో వడ్డీ రేట్లపై బేరం ఆడేందుకు అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవడానికి కింది సూచనలు పాటించాలి.
బిల్స్ గడువులోపు కట్టాలి
క్రెడిట్ కార్డ్‌ల బిల్లులను సకాలంలో చెల్లించండి. పేమెంట్ హిస్టరీ మీ క్రెడిట్ స్కోర్‌కు కీలకం. క్రెడిట్ స్కోర్‌ను లెక్కించేటప్పుడు క్రెడిట్ యుటిలైజేషన్ నిష్పత్తిని కూడా చూస్తారు. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటే మీకున్న బ్యాలెన్స్‌లో మీరు వాడుకున్న మొత్తంతో భాగిస్తే వచ్చేది. ఇది ఎక్కువగా ఉంటే మీకు ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉన్నట్టు అర్థం. క్రెడిట్ వినియోగ నిష్పత్తిని 30 శాతంలోపు ఉంచుకోవాలి. ఒకే సమయంలో ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు లేదా పర్సనల్ కోసం దరఖాస్తు చేయకూడదు.
మీ శాలరీ అకౌంట్‌ను ఉపయోగించండి
మీరు జీతం పొందే ఉద్యోగి అయితే, పర్సనల్ లోన్‌పై మంచి డీల్ పొందడానికి శాలరీ అకౌంట్‌ను వాడండి. పర్సనల్ లోన్‌ను ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా ఇస్తారు కాబట్టి, జీతం ఖాతా బ్యాంకు నుంచి దానిని తీసుకోవడం మంచిది. మీ నెలవారీ ఆదాయం గురించి ఆ బ్యాంకుకు తెలుస్తుంది కాబట్టి తక్కువ డాక్యుమెంటేషన్‌తో వెంటనే లోన్ దొరికే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు ఇవ్వాలని కూడా అడగవచ్చు.
వడ్డీ రేట్లను, ఆఫర్లను పోల్చండి
లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లతో పాటు సంబంధిత రూల్స్‌ను, షరతులను చూడాలి. ఇప్పటికే డిపాజిట్లు ఉండటం, జీతం ఖాతాలు లేదా క్రెడిట్ కార్డులు ఇచ్చిన బ్యాంకులను సంప్రదిస్తే మంచి ఆఫర్ దొరకొచ్చు. ఇతర ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి బ్యాంక్‌బజార్, పైసాబజార్ వంటి ఆన్‌లైన్ ఫైనాన్షియల్ మార్కెట్‌ప్లేస్‌లలో చూడాలి. బ్యారోవర్ క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం, లోన్ టూ -వాల్యూ రేషియో, నెలవారీ ఆదాయం, జాబ్ ప్రొఫైల్ ఆధారంగా బ్యాంక్ వడ్డీ రేట్లను మారుస్తుందని పైసాబజార్ సీనియర్ డైరెక్టర్ సాని అరోరా వివరించారు.
వడ్డీ రేట్ల విషయంలో జాగ్రత్త
కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో పర్సనల్ లోన్ అని చెబుతాయి కానీ లోన్ గడువు ముగిసే సమయానికి ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు. దీన్ని నివారించడానికి, మీ బ్యాంకు మీ లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీ రేటును ఎలా లెక్కిస్తుందో అర్థం చేసుకోవాలి. బ్యాంకులు ఫ్లాట్ రేటుతో లేదా డిమినిషింగ్ (తగ్గింపు) వడ్డీ రేటుతో లోన్ అందిస్తాయి. ఉదాహరణకు, ఒక బ్యాంకు మీకు మూడు సంవత్సరాల పాటు 12 శాతం ఫ్లాట్ వడ్డీ రేటుతో రూ. 5 లక్షల పర్సనల్ లోన్ అందిస్తోంది. మీ మొత్తం వడ్డీ రూ. 1,80,000 అయితే మీ నెలవారీ ఈఎంఐ రూ. 18,889గా అవుతుంది. తగ్గింపు వడ్డీ రేటు ఎలా ఉంటుందంటే.. మూడేళ్ల పాటు 12 శాతం తగ్గింపు వడ్డీ రేటుతో రూ. 5 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. దీనిపై మొత్తం వడ్డీ రూ.97,858 అవుతుంది. మీ నెలవారీ ఈఎంఐ రూ. 16,607 అవుతుంది. ఈ విధానంలో లోన్ తీసుకుంటే మీరు రూ. 82,142 ఆదా చేస్తారు. తగ్గింపు వడ్డీ రేటుతో పర్సనల్ లోన్‌ని ఎంచుకోవడం బెస్ట్.
ఇతర చార్జీల గురించి తెలుసుకోండి...
లోన్‌పై వడ్డీయే కాకుండా, ప్రాసెసింగ్ చార్జ్, జీఎస్టీ, ఇతర ఛార్జీలు ఉంటాయి. లోన్ సమ యంలో ఉండే వివిధ ఖర్చులను లెక్కిస్తే మొ త్తం ఎంత కట్టాలో తెలుస్తుంది. పూర్తి గడువు కు వర్తించే వడ్డీని, ప్రాసెసింగ్ ఫీజులను, జప్తు ఛార్జీలను కూడా లెక్కలోకి తీసుకోవాలి. కొన్ని బ్యాంకులు ఫ్లాట్ ప్రాసెసింగ్ చార్జ్ వసూ లు చేస్తాయి. మరికొన్ని సంస్థలు లోన్ మొత్తం లో ఒక శాతాన్ని (సాధారణంగా 1-3 శాతం) ప్రాసెసింగ్ చార్జ్‌గా విధిస్తాయి. లోన్ ఫోర్ క్లో జ్ చార్జీల గురించి కూడా వాకబు చేయాలి.