చోళమండలం ఫైనాన్స్​ లాభం రూ.1,362 కోట్లు

చోళమండలం ఫైనాన్స్​ లాభం రూ.1,362 కోట్లు
  • మొత్తం ఆర్థిక సంవత్సర లాభం రూ.4,739 కోట్లు
  • రూ. 1.30 చొప్పున డివిడెండ్​

చెన్నై: చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్​కు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో రూ.1,362.18 కోట్ల లాభం (కన్సాలిడేటెడ్​) వచ్చింది. చెన్నైలో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో రూ.1,143.75 కోట్ల లాభాన్ని సాధించింది. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నికరలాభం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో నమోదైన రూ.3,850.56 కోట్ల నుంచి రూ.4,739.88 కోట్లకు పెరిగింది. 

ఈ క్వార్టర్​లో మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో నమోదైన రూ.7,157.31 కోట్ల నుంచి రూ.9,009.36 కోట్లకు పెరిగింది.  పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్​) రూ.33,459.92 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇది రూ.26,086.76 కోట్లుగా నమోదైంది. చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్​లో దాదాపు 44.34 శాతం వాటా ఉన్న చోళమండలం ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఏయూఎం విలువ 2024 మార్చి నాటికి రూ.1,53,718 కోట్ల నుంచి 2025 మార్చి నాటికి 30 శాతం పెరిగి రూ.1,99,876 కోట్లకు చేరుకుంది. 

చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్​లో 60 శాతం వాటా ఉన్న చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2025 మార్చితో ముగిసిన సంవత్సరానికి రూ.8,564 కోట్ల స్థూల రాతపూర్వక ప్రీమియంను సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.7,542 కోట్లతో పోలిస్తే ఇది 14 శాతం ఎక్కువ. 

చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్ లిమిటెడ్​లో 49.5 శాతం వాటా ఉన్న చోళమండలం ఎంఎస్ రిస్క్ సర్వీసెస్ లిమిటెడ్​కు 2025 మార్చి తో ముగిసిన సంవత్సరానికి మొత్తం ఆదాయం రూ. 83.20 కోట్లు వచ్చింది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ. 71.27 కోట్లు వచ్చాయి. 2025 మార్చి తో ముగిసిన సంవత్సరానికి కంపెనీ  రూపాయి ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ. 1.30 చొప్పున తుది డివిడెండ్‌‌‌‌ను డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది.

బిర్లా కార్పొరేషన్‌‌‌‌ లాభం రూ.256.6 కోట్లు

ఎంపీ బిర్లా గ్రూప్ కంపెనీ బిర్లా కార్పొరేషన్ ఈ ఏడాది  మార్చితో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ (క్యూ4) లో  రూ.256.6 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌‌‌‌) సాధించింది.  సిమెంట్ బిజినెస్‌‌‌‌లో సేల్స్ పెరగడంతో లాభం ఏడాది లెక్కన 32.7 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది జనవరి–-మార్చి కాలంలో కంపెనీ రూ.193.34 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. క్యూ4 లో  రెవెన్యూ  రూ.2,654.44 కోట్ల నుంచి  6 శాతం పెరిగి రూ.2,814.91 కోట్లకు చేరింది.  

బిర్లా కార్పొరేషన్ మొత్తం ఖర్చులు 3.4 శాతం పెరిగి రూ.2,496.57 కోట్లుగా ఉన్నాయి.  సిమెంట్ బిజినెస్ నుంచి రెవెన్యూ 6.45 శాతం పెరిగి రూ.2,691.84 కోట్లకు చేరింది. సేల్స్ వాల్యూమ్ 8 శాతం వృద్ధి చెంది 52 లక్షల టన్నులకు పెరిగింది. 2024–25 లో కంపెనీ 1.81 కోట్ల టన్నుల సిమెంట్‌‌‌‌ను విక్రయించింది. అయితే  జూట్ సెగ్మెంట్ నుంచి రెవెన్యూ 1.9 శాతం తగ్గి రూ.123.39 కోట్లకు పడింది.  మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, బిర్లా కార్పొరేషన్ నెట్ ప్రాఫిట్ 29.8 శాతం తగ్గి రూ.295.22 కోట్లకు పడింది.