సాంబార్.. సాంబార్ అనగానే ఇదిదో తమిళనాడు ఫుడ్ అనుకుంటాం.. కానేకాదండీ ఇది ఓ అద్భుతమైన ఆహారం. సాంబార్ ఏదో మొక్కుబడిగా చేయటం వల్ల చాలా మంది లైట్ తీసుకుంటారు. మంచి ప్రొటీన్స్, వెజిటబుల్స్ తో ఇలా తయారు చేస్తే.. ఒంటికి బలం కూడా. బలాన్ని ఇచ్చే టేస్టీ సాంబార్ ఇలా తయారు చేసుకోండి.. మీరే కాదు మీ ఇంటిల్లపాదీ లొట్టలేసుకుంటూ తింటారు. రోజూ కాకపోయినా వారంలో కనీసం రెండు సార్లు అయినా సాంబార్ ఉంటే.. ఆ టేస్టే వేరు అంటారు..
బలాన్ని ఇచ్చే టేస్టీ సాంబార్ కు ఏం కావాలి.. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా :
సాంబార్ లోకి.. కావాల్సినవి:
కందిపప్పు: వంద గ్రాములు
చింతపండు: యాభై గ్రాములు
బెల్లం చిన్న ముక్క
సాంబార్ఉల్లిపాయలు: నాలుగు
మినప్పప్పు: అర టీ స్పూన్
శెనగపప్పు: అర టీ స్పూన్
నూనె: పావుకప్పు
ఎండుమిర్చి: రెండు
ఆవాలు: ఒక టీ స్పూన్
పచ్చిమిర్చి: నాలుగు
కరివేపాకు: రెండు రెబ్బలు
మునక్కాయ (సగం): ముక్కలు
ముల్లంగి (తరిగి): అర కప్పు
బెండకాయ: ఒకటి
క్యారెట్ (తరిగి): అరకప్పు
టొమాటో (తరిగి): ఒకటి
ఫ్రెంచ్బీన్స్ (తరిగి): కొన్ని
తీపి గుమ్మడి (తరిగి): ఒక కప్పు
సొరకాయ (తరిగి): ఒక కప్పు
కారం: ఒక టీ స్పూన్
పసుపు: ఒక టేబుల్ స్పూన్
నీళ్లు: ఒక లీటర్
ఇంగువ: పావు చెంచా
ఉప్పు: తగినంత సాంబార్
మిశ్రమం కోసం..
నూనె: ఒక టేబుల్ స్పూన్
ఎండుమిర్చి: పది-పదిహేను
బియ్యం: ఒక టీస్పూన్
ధనియాలు: పావుకప్పు
జీలకర్ర: ఒక టీస్పూన్
మినప్పప్పు: ఒక టీస్పూన్
శెనగపప్పు: ఒక టీ స్పూన్
పచ్చి కొబ్బరి తురుము: పావు కప్పు
మెంతులు: పావు స్పూన్
తయారీ విధానం:
వంద గ్రాముల కందిపప్పును నీళ్లు పోసి గంటసేపు నానబెట్టాలి. తర్వాత సరిపడా నీళ్లు పోసి, పసుపు వేసి పప్పు మెత్తగా ఉడికించాలి. సాంబార్ మిశ్రమం కోసం ఒక పాన్లో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి, అందులో మిశ్రమం కోసం తీసుకున్న దినుసులు అన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా వేస్తూ, వేగించాలి. సువాసన రాగానే, కొబ్బరి తురుము వేసి కలిపి దించేయాలి. వీటన్నింటినీ మిక్సీలో వేసి, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్నిఒక గిన్నెలో తీసి పక్కనపెట్టాలి. తర్వాత అడుగు మందంగా ఉన్న పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగించాలి. తర్వాత ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత బెండకాయ ముక్కలు, తీపి గుమ్మడి ముక్కలు, మునక్కాయలు, క్యారెట్ ముక్కలు, ముల్లంగి, సొరకాయ, ఫ్రెంచీన్స్, టొమాటో ముక్కలు, సరిపడినంత ఉప్పు వేసి, అన్నీ బాగా కలిపి మూతపెట్టి, ఓ మాదిరి మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత లీటర్ నీళ్లు పోసి, అందులోనే ఉడికించి పెట్టిన పప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ఇందులోనే రెడీ చేసిన సాంబార్ మిశ్రమం వేసి, సన్నటి మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఇందులోనే చింతపండు రసం, బెల్లం, కరివేపాకు, ఇంగువ వేసి సన్నటి మంట మీద మరో పది నిమిషాలు ఉడికిస్తే సాంబార్ రెడీ. టేస్టును బట్టి. అవసరమనుకుంటే కారం కలుపుకోవచ్చు. కూరగాయలు కూడా నచ్చినవి వేసుకోవచ్చు. సాంబార్ పలుచగా కావాలంటే నీళ్లు ఎక్కువ పోసి ఉడికించొచ్చు. చాలా రకాల కూరగాయలు ఉంటాయి. కాబట్టి పోషకాలు ఎక్కువగా అందుతాయి.
