ఈ పరాటాలను ఒకసారి ట్రై చేయండి

ఈ పరాటాలను ఒకసారి ట్రై చేయండి

దోశలు, చపాతీలు చేయడం ఈజీయే కానీ.. పరాటాలు చేయడం కాస్త కష్టం అనుకుంటారు కొందరు. పైగా అంత కష్టపడి చేసినా సరిగా రాదు కదా అనే ఆలోచన ఉంటుంది. పరాటాలు చేసేందుకు వాడే మైదా పిండి హెల్త్​కి మంచిది కాదు. కానీ, ఈ పరాటాలు మాత్రం టేస్ట్​తో పాటు హెల్దీ కూడా. పైగా వీటిని చేయడం చాలా ఈజీ. మరింకెందుకాలస్యం... ఈ పరాటాలను ఒకసారి ట్రై చేయండి.

సోయా పరాటా

కావాల్సినవి :
గోధుమ పిండి – రెండు కప్పులు, నూనె – రెండు టీస్పూన్లు
ఉప్పు, నీళ్లు – సరిపడా
మీల్​ మేకర్​ (సోయా) – రెండు కప్పులు, పసుపు – అర టీస్పూన్, వెల్లుల్లి, పచ్చిమిర్చి – ఒక టేబుల్​ స్పూన్
ఉల్లిగడ్డ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
కారం – ఒకటిన్నర టీస్పూన్
జీలకర్ర – ఒక టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
టొమాటో – ఒకటి
ఆమ్​చూర్​ పొడి – ఒక టీస్పూన్

తయారీ :
గోధుమ పిండిలో నూనె, ఉప్పు, కారం, పావు టీస్పూన్ పసుపు వేసి, నీళ్లు పోసి ముద్ద చేసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో మీల్ మేకర్​ వేయాలి. మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వడకట్టి, చన్నీళ్లతో కడగాలి. తరువాత చేత్తో నీళ్లన్నీ పిండేసి, ముద్ద చేయాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు, పావు టీస్పూన్ పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. టొమాటో తరుగు వేసి, అది వేగాక ఉప్పు, మీల్ మేకర్​ మిశ్రమం కలపాలి. అది బాగా కలిశాక, ఉప్పు, ఆమ్​చూర్​ పొడి కలపాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసిన చపాతీ పిండిని ఉండలు చేసి చపాతీల్లా ఒత్తాలి. అందులో మీల్ మేకర్ మిశ్రమాన్ని స్టఫ్​ చేసి, మళ్లీ ముద్ద చేయాలి. దాన్ని కాస్త చేత్తో ఒత్తి, తర్వాత పరాటాలా ఒత్తాలి. వేడి పాన్​ మీద వీటిని నూనెతో కాల్చితే సోయా పరాటా రెడీ. 

పచ్చిబటానీలతో 


కావాల్సినవి :
పచ్చి బటానీలు – ఒక కప్పు
నూనె, నెయ్యి – ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున, జీలకర్ర – ఒక టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు – పదిహేను
పచ్చిమిర్చి – ఐదు
ఇంగువ – అర టీస్పూన్
ఉప్పు, నీళ్లు – సరిపడా
మిరియాల పొడి – చిటికెడు
కొత్తిమీర – కొద్దిగా
ఆమ్​చూర్ పొడి – ఒక టీస్పూన్
గోధుమ పిండి – రెండు కప్పులు
తయారీ :
పాన్​లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేగించాలి. అందులో ఇంగువ, పచ్చిబటానీ, ఉప్పు వేసి కలపాలి. మూత పెట్టి మూడు నిమిషాలు ఎక్కువ మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి బటానీ మిశ్రమాన్ని చల్లార్చాలి. తరువాత రోట్లో కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి నూరాలి. మిక్సీజార్​లో బటానీల మిశ్రమంతోపాటు నూరిన మిశ్రమాన్ని కూడా కలిపి గ్రైండ్ చేయాలి. దాన్ని గిన్నెలోకి తీసి, ఆమ్​చూర్ పొడి, కొత్తిమీర వేసి కలపాలి. పరాటా కోసం గోధుమ పిండిలో ఉప్పు, నీళ్లు పోసి ముద్ద కలపాలి. తర్వాత నూనె వేసి కలిపి, అరగంట పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండి ముద్ద తీసుకుని చిన్న గిన్నెలా చేత్తో ఒత్తి, అందులో బటానీల మిశ్రమం పెట్టి అంచులు మూయాలి. ఆ ముద్దను చపాతీలా ఒత్తి, పాన్​ మీద నూనెతో కాల్చాలి.

సొరకాయతో..
కావాల్సినవి :
సొరకాయ తురుము – రెండు కప్పులు
గోధుమ పిండి – రెండు కప్పులు
ఉప్పు, నీళ్లు – సరిపడా, కొత్తిమీర తరుగు – మూడు టేబుల్ స్పూన్లు, నెయ్యి – పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
తయారీ :
ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, సొరకాయ తురుము, కొత్తిమీర తరుగు, జీలకర్ర వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసి, నెయ్యి వేసి ముద్దగా కలపాలి. అందులో కొంచెం పిండి తీసుకుని చపాతీల్లా ఒత్తాలి. దానిపై నెయ్యి పూసి, మడత పెట్టి మరోసారి ఒత్తాలి. వాటిని నెయ్యితో రెండు వైపులా కాల్చి తింటే టేస్ట్ బాగుంటుంది.

 మష్రూమ్ పరాటా


కావాల్సినవి :
మష్రూమ్స్ – పావు కప్పు
గోధుమ పిండి – ఒక కప్పు
పాలు – పావు కప్పు
వెన్న – మూడు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు – ఒక టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీస్పూన్
పసుపు – చిటికెడు
కొత్తిమీర – కొద్దిగా
ఉల్లిగడ్డ తరుగు – పావు కప్పు
ఉప్పు – సరిపడా 
జీలకర్ర – అర టీస్పూన్
తయారీ :
ఒక గిన్నెలో గోధుమ పిండి, పాలు, నీళ్లు, వెన్న వేసి ముద్దగా కలిపి పక్కన పెట్టాలి. ఒక పాన్​లో వెన్న వేడి చేసి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగించాలి. అవి వేగాక అందులో మష్రూమ్స్ వేగించాక ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి. ఆ తర్వాత గోధుమ పిండి తీసి, చేత్తో గుంతలా చేసి అందులో మష్రూమ్​ స్టఫింగ్ పెట్టి మూసేయాలి. దాన్ని చపాతీలా ఒత్తి, పాన్​ మీద నూనె లేదా వెన్నతో కాల్చాలి. 

సజ్జ పరాటా


కావాల్సినవి :
సజ్జ పిండి – ఒకటిన్నర కప్పు
ఉప్పు, నూనె, నీళ్లు – సరిపడా
పనీర్ – ముప్పావు కప్పు
మెంతికూర తరుగు – పావు కప్పు
టొమాటో తరుగు (గింజలు తీసి) – 
పావు కప్పు
పచ్చిమిర్చి తరుగు – ఒకటిన్నర టీస్పూన్
తయారీ :
ఒక గిన్నెలో సజ్జ పిండి, ఉప్పు వేసి, వేడి నీళ్లు పోసి ముద్దగా కలిపి పక్కన పెట్టాలి. స్టఫింగ్ కోసం మరో గిన్నెలో పనీర్, పచ్చిమిర్చి, టొమాటో, మెంతి కూర తరుగు, ఉప్పు వేసి కలపాలి. రెడీ చేసి పెట్టిన పిండి ముద్ద కొంచెం తీసుకుని రోటీలా చేసి, దాని మీద స్టఫింగ్​ పెట్టాలి. స్టఫింగ్ పైన మరో సజ్జ రోటీ పెట్టి, అంచులు మూసేయాలి. దాన్ని పాన్​ మీద నెయ్యితో రెండు వైపులా కాల్చాలి.

మొలకెత్తిన విత్తనాలతో..


కావాల్సినవి :
మొలకెత్తిన పెసలు – అర కప్పు
ఉల్లిగడ్డ తరుగు – పావుకప్పు
పచ్చిమిర్చి తరుగు – ఒక టీస్పూన్
కొత్తిమీర, పుదీనా తరుగు – అర కప్పు
జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా – ఒక్కోటి ఒక్కో టీస్పూన్ చొప్పున
ఉప్పు, నీళ్లు – సరిపడా
గోధుమ పిండి – ఒక కప్పు
తయారీ :
గోధుమ పిండిలో ఉప్పు వేసి, నీళ్లు పోసి ముద్ద చేయాలి. నూనె వేసి మరికాసేపు పిండిని మెత్తగా కలిపి, పక్కన పెట్టాలి. మొలకెత్తిన పెసల్ని ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత వాటిలో కారం, జీలకర్ర పొడి, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ తరుగు వేసి కలపాలి. రెడీ చేసి పెట్టిన పిండిని ఉండలు చేసి చపాతీల్లా ఒత్తాలి. అందులో పెసల మిశ్రమాన్ని స్టఫ్​ చేసి పెట్టి మరో చపాతీతో మూసేసి, మళ్లీ ఒత్తాలి. దీన్ని పాన్​ మీద నూనెతో రెండువైపులా కాల్చాలి.