వడి వడిగా వడియాలు.. వేసవిలో ఈ వడియాలు తినాల్సిందే

వడి వడిగా వడియాలు.. వేసవిలో ఈ వడియాలు తినాల్సిందే

ఈ మండే వేసవిలో అన్నంలోకి రసమో, పులుసో చేసుకుని తింటుంటే గొంతులోకి ఇట్టే జారిపోతుంది. దాంతోపాటు మధ్యమధ్యలో వడియాలు కరకరమనిపిస్తే ఆ టేస్టే వేరు. మరి ఎందుకు ఆలస్యం ఎర్రటి ఎండల్ని వాడుకుని రుచితో పాటు హెల్దీగా ఉండే వడియాల పని పడితే సరి.

కారప్పూస వడియాలు

కావాల్సినవి :
బియ్యం: రెండు కప్పులు
నీళ్లు: నాలుగు గ్లాసులు
ఉప్పు : సరిపడా
కారం : రెండు టీస్పూన్లు
జీలకర్ర పొడి : ఒక టీస్పూన్
మిరియాల పొడి : అర టీస్పూన్

తయారీ : ఒక గిన్నెలో బియ్యం వేసి, నీళ్లతో కడిగి వడకట్టాలి. వాటిని మిక్సీజార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఒక పాన్లో నీళ్లు పోసి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. నీళ్లు కాగాక గ్రైండ్ చేసిన బియ్యప్పిండిని ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ వేయాలి. మిశ్రమం దగ్గర పడేవరకు గరిటెతో తిప్పుతూనే ఉండాలి. తరువాత కారప్పూస గిద్దెల్లో పిండి వేసి, కాటన్ బట్టపై సన్నగా కారప్పూసలా వత్తాలి. రెండు రోజులు ఎండలో పెడితే కారప్పూస వడియం రెడీ. 

ఆలూ మసాలా

కావాల్సినవి :
ఆలుగడ్డలు: రెండు
అటుకులు : ఒక కప్పు
జీలకర్ర: ఒక టీస్పూన్
ఎండు మిర్చి తునకలు : రెండు టీస్పూన్లు
ఉప్పు: సరిపడా
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
పుదీనా లేదా కొత్తిమీర లేదా కరివేపాకు: కొద్దిగా

తయారీ : ఆలుగడ్డ రెండు ముక్కలుగా కోయాలి. ప్రెజర్ కుక్కర్లో నీళ్లు పోసి ఆలు గడ్డ ముక్కలు ఉడికించాలి. ఆ తరువాత తొక్క తీసి, పీలర్తో తురమాలి. ఆ తురుములో జీలకర్ర, ఎండు మిర్చి తునకలు, ఉప్పు, కరివేపాకు, పుదీనా లేదా కొత్తిమీర వేసి కలపాలి. మిక్సీ జార్లో అటుకులు వేసి మెత్తగా పొడి చేయాలి. ఆ పొడి కూడా ఆలూ మిశ్రమంలో కలపాలి. పిండి ముద్దగా అయ్యాక, చేతికి నూనె రాసుకుని, చిన్న చిన్న ఉండలు చేయాలి. ప్లాస్టిక్ కవర్ మీద నూనె పూసి, ఒక ఉండ పెట్టి, దానిపై మరో కవర్ పెట్టి స్టీల్ బాక్స్​తో పలుచగా వత్తాలి. వీటిని ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి. రెండు గంటలయ్యాక ఒకవైపు ఆరతాయి, వాటిని రెండో వైపు తిప్పాలి. అటువైపు కూడా ఆరిపోయాక ఎండలో కాసేపు పెట్టి బాగా ఎండబెట్టాలి. పాన్లో తక్కువ నూనె వేడి చేసి, చిన్న మంట మీద వేగించుకునే తింటే భలే టేస్టీగా ఉంటాయి ఈ ఆలు వడియాలు.

సగ్గు బియ్యంతో

కావాల్సినవి :
సగ్గుబియ్యం : ఒక కప్పు
నీళ్లు : అర కప్పు
ఉప్పు : సరిపడా
జీలకర్ర : ఒక టీస్పూన్
కరివేపాకు : కొంచెం

తయారీ : సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడగాలి. తర్వాత సగ్గుబియ్యంలో నీళ్లు పోసి మూడు గంటలు నానబెట్టాలి. మధ్యమధ్యలో కలపాలి. నానబెట్టిన సగ్గుబియ్యంలో ఉప్పు వేసి కలపాలి. అందులో జీలకర్ర, కరివేపాకు కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి, సగ్గుబియ్యం మిశ్రమం ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వేయాలి. పిండిని సమంగా పరిచి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. చల్లారాక వాటిని తీసి తడి బట్ట మీద ఆరబెట్టాలి. ఫ్యాన్ గాలికైతే రెండు రోజులు, ఎండలో అయితే ఒక్కరోజు ఎండబెడితే సరిపోతుంది. స్పైసీ టేస్ట్ ఇష్టపడే వాళ్లు జీలకర్ర, కరివేపాకు బదులు ఎండు మిర్చి తునకలు వేసుకోవచ్చు. ఇవేవీ వద్దనుకుంటే ఖాళీ సగ్గుబియ్యంతోనే ఈ వడియాలు పెట్టుకోవచ్చు. 

రాగిపిండితో

కావాల్సినవి :
రాగిపిండి: ఒక కప్పు
సగ్గుబియ్యం: పావు కప్పు
నీళ్లు: పదకొండు కప్పులు
పచ్చిమిర్చి: మూడు
అల్లం: చిన్న ముక్క
ఉప్పు : సరిపడా
జీలకర్ర : ఒక టీస్పూన్
ఇంగువ : అర టీస్పూన్ 
నువ్వులు : పావు కప్పు

తయారీ :సగ్గుబియ్యంను మిక్సీజార్లో వేసి పిండిలా పట్టాలి. ఒక గిన్నెలో రాగి పిండి, సగ్గుబియ్యం పిండి వేసి కలపాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా పల్చగా కలపాలి. పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో తొమ్మిది కప్పుల నీళ్లు పోసి వేడిచేయాలి. అందులో ఉప్పు, జీలకర్ర, నువ్వులు, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ వేసి కలపాలి. ఆ తర్వాత రాగి పిండి పోస్తూ మిశ్రమం దగ్గర పడేవరకు ఉండలు లేకుండా గరిటెతో తిప్పాలి. ఆ తరువాత కాటన్ బట్ట మీద వడియాలు పెట్టాలి. రెండు రోజులు ఎండబెట్టాక, వడియాలు ఎండ బెట్టిన వైపు కాకుండా వెనక వైపు నీళ్లు చల్లి వడియాలు తీయాలి. తర్వాత మళ్లీ వాటిని ఎండబెట్టాలి. వీటిని నూనెలో వేగిస్తే క్రిస్పీ వడియాలు నమిలేయొచ్చు.

బీట్​రూట్ తో

కావాల్సినవి :
బీట్​రూట్: రెండు
ఉప్పు: సరిపడా
పచ్చి లేదా ఎండు మిర్చి : మూడు
 నీళ్లు : మూడు కప్పులు
బొంబాయి రవ్వ : ఒక కప్పు

తయారీ : బీట్​రూట్ ముక్కలు, పచ్చి లేదా ఎండు మిరపలను మిక్సీజార్లోకి తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి, ఉప్పు వేసి తెర్లేవరకు కాగబెట్టాలి. అందులో బీట్​రూట్ రసం పోసి కలపాలి. తరువాత బొంబాయి రవ్వ వేస్తూ గరిటెతో తిప్పాలి. మిశ్రమం కాస్త దగ్గరపడ్డాక కాటన్ బట్టపై వడియాల్లా పెట్టాలి. వీటిని రెండు రోజులు ఎండబెట్టాలి. నూనెలో వేగించుకుని తింటే కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. 

ముల్లంగితో

కావాల్సినవి :
మినపప్పు : పావు కిలో
ముల్లంగి తురుము : అర కిలో
ఉప్పు: సరిపడా

తయారీ : మినపప్పు బాగా కడిగి నాలుగ్గంటలు నానబెట్టాలి. నానబెట్టిన పప్పులో ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండిలో ముల్లంగి తురుము వేసి బాగా కలపాలి. తర్వాత ఒక బట్టపై వడియాలు పెట్టి మూడు రోజులు ఎండబెట్టాలి. పాన్లో నూనె వేడి చేసి, వడియాల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. వీటిని చారు, పులుసులతోనే కాదు కూరలతో పాటు తిన్నా బాగుంటాయి.