
ఇష్టమైన ఖాకీ కొలువు కోసం ఫైనల్ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థుల్లో పోటీ తీవ్రంగా ఉంది. సివిల్ ఎస్సై మొదలు డ్రైవర్ పోస్టు వరకు ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల్లోని వివిధ విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్ కలిపి.. మొత్తం 11 రకాల పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్‌లో ఉన్న ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం..
సివిల్ ఎస్సై మొత్తం పోస్టులు 554 భర్తీ చేయాల్సి ఉండగా.. తుది రాత పరీక్షకు 41,256 మంది పురుషులు, 11,530 మంది మహిళలు పోటీ పడుతున్నారు. సరాసరి ఒక్కో పోస్టుకు 95 మంది పోటీ పడుతున్నారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 15,644 భర్తీ చేయనున్నారు. భారీ సంఖ్యలో పోస్టులు ఉన్నా.. ఒక్కో సివిల్ కానిస్టేబుల్ పోస్టుకు దాదాపుగా ఆరుగురు బరిలో ఉన్నారు. 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్షకు 59,325 మంది పోటీలో ఉన్నారు. అంటే ఒక్కో పోస్టుకు సరాసరిన 96 మంది పోటీ పడుతున్నారు.
ఎస్‌ఐ పరీక్ష: ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయితే చాలు ఈ మార్కులను ఫైనల్ మెరిట్లో తీసుకోరు. జనరల్ స్టడీస్ 200 మార్కులకు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 మార్కులకు ఇస్తారు. ఇందులో వచ్చిన మార్కులే ఫైనల్ సెలెక్షన్ లో తీసుకుంటారు.
కానిస్టేబుల్ ఎగ్జామ్: ఇందులో కేవలం ఒకే పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్, ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు.
ఇంగ్లీష్: ఇందులో టెన్సెస్, ఆర్టికల్స్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్‌లు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇడియమ్స్ 50 ప్రశ్నలు ఉంటాయి. 75 మార్కులకుగాను లెటర్ రైటింగ్, ఎస్సే రైటింగ్, ప్రెస్సీ, కాంప్రహెన్షన్, రిపోర్ట్ రైటింగ్ మొదలైనవి అడుగుతారు.
తెలుగు: ఆబ్జెక్టివ్ విధానంలో సంధులు, సమాసాలు, విభక్తులు, అలంకారాల నుంచి ప్రశ్నలు వస్తాయి ఎస్సే కరెంట్ అఫైర్స్‌పై ఉంటుంది. లెటర్ రైటింగ్, ఒక వ్యాసాన్ని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేయడం, రిపోర్ట్ రైటింగ్, కాంప్రహెన్షన్ మొదలైన అంశాలపై ప్రశ్నలుంటాయి.
అర్థమెటిక్: అర్థమెటిక్ విభాగంలో నిష్పత్తి- అను పాతానికి సంబంధించి బహుళ నిష్పత్తి, వర్గ నిష్పత్తి, ఘన నిష్పత్తి, విలోమ నిష్పత్తి, రెండు నిష్పత్తులకు ఒక సంఖ్య కలపడం లేదా తీసివేయడం ప్రాక్టీస్ చేయాలి. బారువడ్డీ, చక్రవడ్డీల మధ్య సంబంధం కనుగొనే ప్రశ్నలు సాధన చేయాలి. సహజ సంఖ్యల సగటు, సగటు వేగం, ప్రధాన సంఖ్యల సగటు, తరగతిలోని విద్యార్థుల సగటు మొదలైన ప్రశ్నలపై పట్టు సాధిం చాలి. లాభనష్టాల్లో ఒక వస్తువు కొన్నధర కంటే ఎక్కువ లేదా తక్కువ ధరకు అమ్మితే వచ్చే లాభం లేదా నష్టం అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. కాలం –పని టాపిక్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక పనిని కొన్ని రోజుల్లో చేసినట్లయితే.. అందరూ కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? వచ్చిన డబ్బుని ఏవిధంగా పంచుకోవాలి? మొదలైన అంశా లను సాధన చేయాలి. మిశ్రమాలు, రైళ్లకు సంబంధిం చిన అంశాలు, గడియారాలు, భాగస్వామ్యం, క.సా.గు. గ.సా.భా, వయసులు, భిన్నాలు, వైశాల్యాలు- ఘనపరిమాణాలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్ మొదలైన అంశాలపై పట్టు సాధించాలి.
రీజనింగ్: ఈ విభాగాన్ని వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ అని విభజించి సాధనచేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. వెర్బల్ రీజనింగ్‌లో కోడింగ్, డీకోడింగ్, దిశాత్మక పరీక్ష, పరిమాణ పరీక్ష, ర్యాంకింగ్ టెస్ట్, మిస్సింగ్ నంబర్, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష, అక్షరమాల, లాజికల్ వెన్ చిత్రాలు మొదలైన అంశాలు ఉంటాయి. నాన్ వెర్బల్ రీజనింగ్‌లో పాచికలు, దర్పణ (అద్దం) ప్రతిబింబాలు, నీటి ప్రతిబింబాలు, శ్రేణులు, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష మొదలైన అంశాలపై పట్టు సాధించాలి. లాజికల్ రీజనింగ్‌లో ప్రకటనలు–-వాదనలు, ప్రకటనలు-–ఊహాగానాలు, ప్రకటనలు–-తీర్మానాలు, తర్కవాదం, డెసిషన్ మేకింగ్ మొదలైన టాపిక్స్ ఉంటాయి.
తెలంగాణ ఉద్యమ చరిత్ర: ఈ విభాగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకూ అన్ని అంశాలూ చదవాలి. తెలంగాణలోని వివిధ జాతులు, జాతరలు, పండగలకు సంబంధించిన అంశాలు, ముల్కీ-–నాన్ ముల్కీ అంశం, హెచ్‌ఎస్‌సీ స్థాపన, నిజాం సబ్జెక్ట్స్ లీగ్, హైదరాబాద్ సంస్థానం సైనిక చర్య ద్వారా భారత్‌లో విలీనం - పరిణామాలు. ముల్కీ ఉద్యమం, 1969 - తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం, టీఆర్‌ఎస్ సభలు, 2009 తెలంగాణ ఉద్యమం, శ్రీకృష్ణ కమిటీ నివేదిక, పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటు అంశాలు చదవాలి.
పాలిటీ అండ్ ఎకానమీ: రాజ్యాంగం ఏర్పాటు, రచన, పౌరసత్వం, ప్రవేశిక, ప్రాథమిక హక్కులను తెలుసుకోవాలి. ఎకానమీలో ప్రణాళిలు, పేదరికం, నిరుద్యోగం, జనాభా, బడ్జెట్‌ను వర్తమాన అంశాలను జోడిస్తూ చదవాలి. పర్సనాలిటీ టెస్టులో ఉండే ఎథిక్స్, జెండర్ సెన్సిటివిటీ, బలహీన వర్గాలు, సోషల్ అవేర్నెస్, ఏమోషనల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి సారించాలి.
కరెంట్ అఫైర్స్: పరీక్ష తేదీకి 9 నెలల ముందు వరకు అంశాలను చదవాలి. సదస్సులు, అవార్డులు, క్రీడాంశాలు, ప్రధాన నియామకాలు, రాజీనామాలు, ప్రముఖుల మరణాలు, పర్యటనలు, శాస్త్ర-సాంకేతిక విశేషాలు, పుస్తకాలు–రచయితలు, ఎన్నికలు, సంస్థల సర్వేలపై దృష్టి పెట్టాలి. ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత వీలైనన్ని మాక్ టెస్టులు రాయాలి. ఈ ఫలితాలు విశ్లేషించుకోవాలి. ఏ అంశాల్లో వెనుకబడుతున్నారో చూసుకుని, వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తూ చదవాలి. ప్రతి మాక్ టెస్టులోనూ ఇదే పద్ధతి కొనసాగిస్తే 15 పరీక్షలు రాసేసరికి సిలబస్‌పై గట్టి పట్టు లభిస్తుంది. విజయావకాశాలు మెరుగవుతాయి.
జనరల్ స్టడీస్
- జనరల్ సైన్స్ విభాగం నుంచి మానవ నిర్మాణం, వ్యాధులు, పోషణలోని అంశాలైన విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, రక్తవర్గాలు, మానవుడి నిజ జీవితంలో సైన్స్ ఉపయోగాలు, ఆధునిక భౌతికశాస్త్రానికి సంబంధించిన అంశాలు, అలాగే శాస్త్ర-సాంకేతిక రంగానికి సంబంధించి గ్రహాలు, ఉపగ్రహాలు, రక్షణ వ్యవస్థలోని యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, పరిశోధనలపై ప్రశ్నలు అడగొచ్చు.
- ఇండియన్ జాగ్రఫీలో సరిహద్దులు, నదులు, అడవులు, వ్యవసాయం, నీటిపారుదల వ్యవస్థ, ఖనిజ వనరులు, రవాణా వ్యవస్థ, పరిశ్రమలు, జనాభాకు సంబంధించిన అంశాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి.. సరిహద్దులు, నీటి పారుదల వ్యవస్థ, ప్రాజెక్టులు, పరిశ్రమలు, వ్యవసాయం-పంటలు, జనాభా, నదీ వ్యవస్థ గురించి చదవాలి.
- ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా జాతీయోద్యమంపై ఫోకస్ చేయాలి. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి జాతీయోద్యమం వరకు అన్ని అంశాలపై పట్టు సాధించాలి. యూరోపియన్ల రాక, కుల, రైతు ఉద్యమాలు, గవర్నర్ జనరల్స్ గురించి చదవాలి. ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి విషయాలపై అవగాహన పెంచుకోవాలి.
కామన్ సిలబస్
జనరల్ సైన్స్, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, పర్సనాలిటీ టెస్ట్ ఇవి రెండింటిలో కామన్‌గా ఉంటాయి. కానిస్టేబుల్ పరీక్షలో ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయాలి. కానిస్టేబుల్ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఎస్‌ఐ పరీక్షలో ‘తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు’ అని సిలబస్‌లో ఇచ్చారు. ఎక్కువ ప్రశ్నలు సుమారు 20 నుంచి 30 వరకు ఇందులో అడిగే అవకాశం ఉంది. కానిస్టేబుల్ పరీక్షలో తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేయాలి.