
ముంబై: నిఫ్టీ 50 కీలక రేంజ్ లోకి ఎంటరయ్యింది. అమెరికా రిజర్వ్ బ్యాంక్ ఫెడ్ రేట్ కట్స్ ఉంటాయనే అంచనాలతో బుధవారం (సెప్టెంబర్ 17) 25,300 ఎగువన క్లోజ్ అయ్యింది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై సానుకూల చర్చలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో స్టాక్ మార్కెట్లు బుధవారం (సెప్టెంబర్ 17) రెండో రోజు కూడా లాభపడ్డాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 313.02 పాయింట్లు పెరిగి 82,693.71 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 91.15 పాయింట్లు పెరిగి 25,330.25 వద్ద స్థిరపడింది.
లాభపడిన కంపెనీలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఉన్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, ఐటీసీ, టాటా స్టీల్ నష్టపోయాయి. ఎఫ్ఐఐలు మంగళవారం రూ.308.32 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఇదిలా ఉంటే, యాప్ ఆధారిత బ్యూటీ, హోమ్ సర్వీసెస్ ప్లాట్‌ఫారమ్ అర్బన్ కంపెనీ లిమిటెడ్ షేర్లు బుధవారం మార్కెట్‌లో అడుగుపెట్టి 62 శాతం ప్రీమియం సాధించాయి.
కంపెనీ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.103తో పోలిస్తే రూ.161 వద్ద 56.31 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ ప్రారంభించింది. తరువాత 62.18 శాతం పెరిగి రూ.167.05 వద్ద ముగిసింది. అర్బన్ కంపెనీ రూ.1,900 కోట్ల ఐపీఓ 103.63 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.
ఇవాళ (సెప్టెంబర్ 18) మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి..?
బుధవారం రాత్రి అమెరికా ఫెడ్ పాలసీ ప్రకటించింది. ఇందులో భాగంగా వడ్డీ రేట్లను 25 శాతం తగ్గించింది. గత 9 నెలల్లో ఫెడ్ రేట్ కట్స్ ఇదే తొలిసారి. యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ నుంచి వడ్డీ రేట్లు తగ్గించాలనే ఒత్తిడి ఉన్నప్పటికీ.. ఎక్కడా తగ్గని ఫెడ్ ఛైర్మన్ పావెల్.. ఎట్టకేలకు రేట్లు కట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇండియన్ మార్కెట్లకు పాజిటివ్ న్యూస్ అంటున్నారు ఎనలిస్టులు. దీంతో గురువారం (సెప్టెంబర్ 18) గిఫ్ట్ నిఫ్టీ 75 పాంయిట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతోంది. ఇది మార్కెట్లకు పాజిటివ్ సైన్. దీంతో 25,400 కు రేంజ్ కు నిఫ్టి వెళ్తే ఛాన్స్ ఉంది.