అధికారులపై కుక్కల దాడి ఘటన.. హెచ్ఆర్సీకి అడ్వకేట్ ఫిర్యాదు

అధికారులపై కుక్కల దాడి ఘటన.. హెచ్ఆర్సీకి అడ్వకేట్ ఫిర్యాదు
  • విచారణకు స్వీకరించిన కమిషన్​
  • ప్రతివాదిగా సీఎస్​ను చేర్చిన హెచ్ఆర్సీ

పద్మారావునగర్, వెలుగు: అధికారులను వీధి కుక్కలు గాయపరిచిన ఘటనపై అడ్వకేట్ రామారావు ఇమ్మనేని ఇచ్చిన ఫిర్యాదును రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణకు స్వీకరించింది. ఈ ఘటనలో ప్రతివాదిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చేరుస్తూ నంబర్ 858/ఐఎన్​/2025  ద్వారా విచారణకు నిర్ణయించింది. సూర్యాజిల్లా జిల్లా తుంగతుర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో అధికారులను వీధి కుక్కలు గాయపరిచాయి. ఇండిపెండెంట్స్​ డే సెలబ్రేషన్స్ కు సంబంధించి ఏర్పాట్లలో ఉన్న ఆరుగురిపై వీధి కుక్కలు దాడి చేశాయని రామారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఓ వైపు వీధికుక్కల నియంత్రణపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం మాత్రం కుక్కల నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పై చర్యలు తీసుకోవాలని, వీధికుక్కల దాడిలో గాయపడ్డ ఆరుగురికి వైద్య సహాయం అందించడంతో పాటు తగిన పరిహారం అందించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అడ్వకేట్ రామారావు తన ఫిర్యాదులో రాష్ర్ట మానవ హక్కుల కమిషన్​ ను కోరారు.