తిరుమలలో భక్తుల రద్దీ .. శ్రీవారి దర్శనానికి 25 గంటల టైమ్

 తిరుమలలో భక్తుల రద్దీ ..  శ్రీవారి దర్శనానికి 25 గంటల టైమ్

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులతో పాటూ వీకెండ్ కావడంతో  శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం 25 గంటల సమయం పడుతుంది. గత 10 రోజుల్లో శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో  2 లక్షల 60 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. ఆక్టోపస్ సర్కిల్ నుంచి క్యూ లైన్ ఎంట్రీ వరకు ఉచిత బస్సుల్లో భక్తులను తరలివెళుతున్నారు. క్యూ లైన్లు, రద్దీగా ఉండే ప్రాంతాలలో భక్తులకు అన్ని ఏర్పాట్లను చేసింది టీటీడీ అధికారులు. భక్తుల అధిక రద్దీ కారణంగా జూన్ 30వరకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ 

ఇక నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవులు దగ్గరపడుతుండడం, ఆదివారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి  6 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణమంతా సందడి నెలకొంది.   భక్తులతో క్యూ లైన్లన్నీ నిండిపోయాయి. భారీగా భక్తులు తరలివస్తుండడంతో పార్కింగ్ స్ధలాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా  ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు.  

ఇక తెలంగాణలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారు జాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి దాదాపు 3గంటల సమయం పడుతోంది. కొండపైన వెళ్లే ఉచిత బస్సులు రద్దీగా ఉండటంతో మెట్ల మార్గంలో పైకి చేరుకుంటున్నారు భక్తులు. మరోవైపు కొండపైన కార్లకు  పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో కిందే కార్లను నిలిపేశారు భక్తులు.