కేంద్రానికి కొత్త గుబులు : భారీగా తగ్గుతున్న GST వసూళ్లు

కేంద్రానికి కొత్త గుబులు : భారీగా తగ్గుతున్న GST వసూళ్లు

భారీగా తగ్గుతున్న జీఎస్టీ వసూళ్లు
లోటు రూ.40 వేల కోట్ల వరకు ఉండే చాన్స్‌‌
భరించాల్సింది కేంద్ర సర్కారే!

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోంది. ఆటో, రియల్టీ, ఎఫ్‌‌ఎంసీజీ వంటి రంగాలు అమ్మకాలు లేక చతికిలపడ్డాయి. జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టానికి చేరింది.  ఇవన్నీ చాలవన్నట్టు మోడీ ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందని ఎకానమిస్టులు హెచ్చరిస్తున్నారు. జీఎస్టీ వసూళ్ల రేటు మందగమనం ఇలాగే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రూ.40 వేల కోట్ల లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. ఇండియా సేవలరంగం ఆగస్టులో బాగా వెనుకబడిందని, ప్రభుత్వానికి నిధుల సమస్య ఉంటుందని ఒక ప్రైవేటు సర్వే వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ల వృద్ధిరేటు 10 శాతం ఉండాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్ధారించుకుంది. తొలి ఐదు నెలల్లో ఈ రేటు 6.4 శాతాన్ని మించలేదని క్రెడిట్‌‌ స్విస్‌‌ తెలిపింది. మిగతా ఏడు నెలలు ఇదే రేటు కొనసాగితే రూ.40 వేల కోట్ల లోటు తప్పదని స్పష్టం చేసింది.

నిధులకు కటకట..

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ ఇది వరకే పలు నిర్ణయాలు ప్రకటించడం తెలిసిందే. బ్యాంకులకు రూ.70 వేల కోట్ల క్యాపిటల్‌‌ ఇస్తామని, వాహనాలపై జీఎస్టీ తగ్గింపును పరిశీలిస్తామని, ఎఫ్‌‌పీఐలపై అదనపు సర్‌‌చార్జ్‌‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి ఇవి చాలవని, అయితే మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు లేవని నిపుణులు పేర్కొన్నారు. జీడీపీ ఎంతో ముఖ్యమైన సేవలరంగం వృద్ధిరేటు తగ్గడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది జూలై ఇది 53.8 శాతం కాగా, ఆగస్టులో 52.4 శాతానికి పడిపోయింది. ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఎనిమిది ఇన్‌‌ఫ్రా పరిశ్రమల వృద్ధిరేటు వార్షికంగా 7.3 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

జీఎస్టీ చట్టాల ప్రకారం రాష్ట్రాలకు తప్పనిసరిగా 14 శాతం వార్షికవృద్ధి రేటు ప్రకారం నిధులు ఇవ్వాలి.  అంటే, లోటు మొత్తాన్ని కేంద్రమే భరించాలి. రాష్ట్రాల రెవెన్యూలోటును భర్తీ చేయడానికి ఇది ఆటోమొబైల్స్‌‌ వంటి ప్రొడక్ట్స్‌‌పై సెస్‌‌ వేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌‌ నెలలో మాత్రమే జీఎస్టీ వసూళ్లు 1.13 లక్షల కోట్లు నమోదయ్యాయి. మిగతా నెలల్లో ఆశించినస్థాయి వసూళ్లు నమోదు కాలేదు. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రాష్ట్రాలకు జీఎస్టీ వాటాగా రూ.6.5 లక్షల కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది 14 శాతం పెంపుతో రూ.7.4 లక్షల కోట్లు ఇవ్వాలి. అంటే రూ.90 వేల కోట్లు ఎక్కువ. జీఎస్టీ వసూళ్లు ఈ మేరకు పెరగకున్నా, కేంద్రమే నిధులు సర్దాల్సి ఉంటుందని క్రెడిట్​ స్విస్​ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు అన్నారు.