మన కరోనా మందులకు చైనాలో మస్త్​ డిమాండ్​

మన కరోనా మందులకు చైనాలో మస్త్​ డిమాండ్​
  • మన కరోనా మందులకు చైనాలోమస్త్​ డిమాండ్​
  • బ్లాక్ మార్కెట్​లో  కొంటున్న ప్రజలు

బీజింగ్:  చైనాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సరిపడా మందులు అందుబాటులో లేకపోవడంతోనే భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. చైనా రెండు వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపింది. అయితే, ఇవి అస్సలు పనిచేయడం లేదని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అధిక ధరకు విక్రయిస్తుండటంతో చైనా ప్రజలు, ఇండియన్ జనరిక్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌పై ఆధారపడుతున్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు నివేదిక వెల్లడించింది. ఫైజర్స్ కంపెనీకి చెందిన పాక్స్‌‌‌‌‌‌‌‌లోవిడ్, చైనీస్ సంస్థ జెన్యూన్ బయోటెక్ నుంచి వచ్చిన హెచ్​ఐవీ మెడిసిన్ అజ్వుడిన్‌‌‌‌‌‌‌‌ను చైనా ఆమోదించింది. కానీ, ఈ రెండు వ్యాక్సిన్లు కొన్ని హాస్పిటల్స్​లోనే అందుబాటులో ఉండటంతో బాధితులు ఇండియన్​ జనరిక్​ మందుల కోసం  పరుగులు పెడుతున్నారు. 

ఇల్లీగల్​గా దిగుమతి

చైనాతో పోల్చుకుంటే.. కరోనా ట్రీట్​మెంట్​కు వాడే మన జనరిక్​ మందుల ధర చాలా తక్కువ. ఇవి సమర్థవంతంగా పని చేస్తున్నాయి. ఇండియన్​ డ్రగ్స్ అమ్మకాలకు చైనా అనుమతివ్వకపోవడంతో ఇల్లీగల్​గా దిగుమతి చేసుకుంటున్నారని సౌత్​ చైనా మార్నింగ్​ పోస్ట్​ పేర్కొంది. దేశంలో ఇండియన్​ మెడిసిన్స్​కు డిమాండ్​ పెరిగిందని వివరించింది. డిమాండ్​ను బట్టి యాంటీ కరోనా జెనరిక్​ మెడిసిన్​ బాక్స్ రూ.12 వేల దాకా అమ్ముడుపోతున్నట్టు వివరించింది. చైనీస్​ సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​ వీబోలో ఈ న్యూస్​ ట్రెండింగ్ అవుతున్నది. ఇండియా నుంచి నాలుగు రకాల జనరిక్ యాంటీ కరోనా మెడిసిన్స్​ను ఇలా ఇల్లీగల్​గా దిగుమతి చేసుకుని అమ్ముతున్నారని తెలిపింది. ప్రిమోవిర్, పాక్సిస్టా, మోల్నునాట్, మోల్నాట్రిస్​ అనే బ్రాండ్​లు చైనా మార్కెట్లో ఇల్లీగల్​గా అమ్ముతున్నారని చెప్పింది.

నోరుమెదపని జిన్​ పింగ్​

చైనాలో ఇల్లీగల్​గా ఇండియన్​ జనరిక్​ మెడిసిన్స్ కొంటున్నా.. ఆ దేశ ప్రెసిడెంట్​ జిన్​ పింగ్ అస్సలు నోరు మెదపడం లేదు. కరోనా ప్రభావంతో మెడిసిన్‌‌‌‌‌‌‌‌ షార్టేజ్ రావడంతో జనం హాస్పిటల్స్​ వద్ద క్యూలో నిలబడి ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాగే, శ్మశానం వద్ద డెడ్​బాడీలు గుట్టలుగా పడి ఉన్నాయి. జీరో కరోనా పాలసీతో పాటు ఆంక్షలు ఎత్తేసినప్పటి నుంచి చైనా హాస్పిటల్స్​ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బీజింగ్ సహా చాలా నగరాల్లోని హాస్పిటల్స్​లో సరైన సేవలు అందడం లేదు.

కొనొద్దంటున్న చైనా హెల్త్​ ఎక్స్​పర్ట్స్​

చైనాలో జనరిక్​ మెడిసిన్స్ అమ్మకాలకు ఇండియా ఆమోదం ఇవ్వలేదు. ఇలా ఇల్లీగల్​గా కొనడం చట్టరీత్యా నేరమని సౌత్​ చైనా మార్నింగ్​ పోస్ట్ తన నివేదికలో తెలిపింది. కరోనా కేసులు పెరుగుతాయని చైనా హెల్త్ ఎక్స్​పర్ట్స్, డాక్టర్లు ముందే హెచ్చరించారని పేర్కొంది. చట్టవిరుద్ధంగా మెడిసిన్స్​ కొనొద్దని కూడా ప్రజలకు సూచించినట్టు చెప్పింది. చైనాలో ఐబుప్రోఫెన్, పారాసెటమాల్‌‌‌‌‌‌‌‌ కొరత ఎక్కువగా ఉందని, వీటి ఉత్పత్తి కోసం చైనా నుంచి కొటేషన్లు వస్తున్నాయని ఫార్మాస్యూటికల్స్​ ఎక్స్​పోర్ట్​ ప్రమోషన్​ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ సాహిల్ ముంజాల్ తెలిపారు. జ్వరానికి సంబంధించి మందులు చైనాకు వేగంగా ఎగుమతి చేస్తామన్నారు.