సిటీలో ఎర్రమట్టికి భలే డిమాండ్​

సిటీలో ఎర్రమట్టికి భలే డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఎర్రమట్టికి భలే డిమాండ్​ ఏర్పడుతోంది. నగరవాసులకు గార్డెనింగ్​పై పెరుగుతున్న ఆసక్తితో ఈ మట్టికి గిరాకీ పెరిగింది. భవన నిర్మాణాల కోసం అక్కడక్కడ ఇసుక రాసులు పోసి అమ్ముతున్న తరహాలోనే ఎర్ర మట్టిని కూడా అమ్ముతున్నారు. గిరాకీ పెరగడంతో సిటీ, శివారుల్లో కేవలం ఎర్రమట్టిని అమ్మే ప్రత్యేక అడ్డాలు ఏర్పడ్డాయి. ప్రతి నర్సరీ వద్ద కూడా ఎర్రమట్టిని సెపరేట్​గా అమ్ముతున్నారు.

మొక్కలు పెంచడంపై ఆసక్తి

ప్రహరీ వెంట, ఇంటి లోపలి ప్రాంగణంలో మొక్కలను పెంచడం చాలా మంది అలవాటు చేసుకుంటున్నారు. సిటీ, శివారులో కాలనీలు శరవేగంగా విస్తరిస్తూ కొత్త ఇండ్లు, అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి. మరి కొందరు ఫాం హౌస్​ లు నిర్మించుకుంటున్నారు. కాగా వీరు మొక్కలు పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. అపార్టుమెంట్లలోనివారు తమ ఫ్లాట్​ బాల్కనీ, కిటికీల వద్ద మొక్కలను పెంచుకుంటున్నారు. మొక్కలు బలంగా, ఏపుగా పెరిగేందుకు అనువైన ఎర్రమట్టిని కొంటున్నారు. 

లోడ్​ధర రూ.16 వేలు 

అయితే, ఈ ఎర్ర మట్టి సాధారణంగా సిటీలో దొరకదు. అందుకే మొక్కలు పెంచే ఆసక్తి ఉన్నవాళ్లు, టెర్రస్​పై కూరగాయలు పండించేవారు ఈ మట్టిని ప్రత్యేకంగా కొంటున్నారు. మొక్కల పెంపకానికి, టెర్రస్​ గార్డెనింగ్ కు భారీగా ఎర్రమట్టి అవసరం ఉండటంతో చిరు వ్యాపారులు తట్టాల చొప్పున,  ఒక్కో తట్టా రూ.20కి అమ్ముతున్నారు. భారీగా కొనేవారు టిప్పర్​ లోడ్ ​తెప్పించుకుంటున్నారు. ఆ లోడ్ ధర రూ.16 వేల దాకా ఉంటోంది. సిటీ శివారులైన శంషాబాద్, మహేశ్వరం, బొమ్మల రామారం తదితర ప్రాంతాల నుంచి ఈ మట్టిని  తెప్పిస్తున్నారు.
 
మొక్కలకు బలం

నేను 20 ఏండ్లుగా ఎర్రమట్టిని అమ్ముతున్నా. ఈ మట్టిలో మొక్కలు బాగా పెరుగుతాయి. కూరగాయల మొక్కలకు  ఈ మట్టి మంచి బలం. ఇప్పుడు కొనేవారితోపాటు అమ్మేవారు కూడా పెరిగారు. ‌‌‌‌‌‌‌‌- సమ్మయ్య, సైనిక్​పురి