దారులన్నీ సలేశ్వరం వైపే .. రెండో రోజు పోటెత్తిన భక్త జనం

దారులన్నీ సలేశ్వరం వైపే .. రెండో రోజు పోటెత్తిన భక్త జనం

అచ్చంపేట/ అమ్రాబాద్​,  వెలుగు : సలేశ్వరం లింగమయ్య జాతర ఉత్సవాల్లో  భాగంగా రెండో రోజు మంగళవారం  భక్తులు పోటెత్తారు. గతంలో సలేశ్వరం వెళ్లేందుకు ఎనిమిది  రోజుల పాటు ఫారెస్ట్​ ఆఫీసర్లు అనుమతులు ఇచ్చేవారు. దానిని కేవలం మూడు రోజులకే పరిమితం చేయడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. భక్తుల కోసం అచ్చంపేట ఆర్‌డబ్ల్యూఎస్‌  ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి వసతి కల్పించారు. ఏర్పాట్లను డీఈ హేమలత, ఏఈ లు మధుబాబు, బాల్​ రాం  పర్యవేక్షించారు. 

ఫారెస్ట్​ శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది అడవిలో వేసిన చెత్తను సేకరించారు. తొలి రోజే మూడు ట్రాక్టర్ల చెత్తను సేకరించినట్లు ఫారెస్ట్​ అధికారులు తెలిపారు.    భక్తులు ప్లాస్టిక్ తీసుకురావద్దని చెప్పారు. అలాగే  మార్గం మధ్యలో జంతువులకు హాని తలపెడితే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థలు, దాతలు అన్నదానం చేశారు. తాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు.