
- మహిళలకు తక్కువగా చెల్లింపు
- సీఈఓ సగటు వార్షిక జీతం రూ.16.92 కోట్లు
న్యూఢిల్లీ: మనదేశంలో సీఈఓల జీతాలు చుక్కల్లో ఉంటుండగా, ఉద్యోగుల జీతాలు అతి తక్కువగా పెరుగుతున్నాయని ఆక్స్ఫామ్ స్టడీ వెల్లడించింది. దీని ప్రకారం.. సీఈఓల సగటు జీతం రూ.16.92 కోట్లకు చేరింది. 2019 నుంచి వీళ్ల జీతం దాదాపు 50 శాతం పెరగగా, వర్కర్ల జీతాలు 0.9 శాతమే పెరిగాయి. సగటు వర్కర్ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని సీఈఓలు ఒక గంటలోనే సంపాదిస్తున్నారు!
జీతాల చెల్లింపులో లింగ సమానత్వం కూడా కనిపించడం లేదు. 2022–2023 మధ్య 11,366 కార్పొరేషన్లలో జీతాలను పరిశీలించగా 27 శాతం వరకు తేడా ఉన్నట్టు తేలింది. కొన్ని సంస్థల్లో పురుషులకు వారమంతటికీ జీతం చెల్లిస్తుండగా, మహిళలు శుక్రవారాల్లో ఉచితంగా పనిచేయాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని గమనిస్తే ఇర్లాండ్, జర్మనీల్లో సీఈఓల జీతాలు అత్యధికంగా ఉన్నాయి.
వీళ్లు గత ఏడాది 4.7 మిలియన్ డాలర్ల వరకు సంపాదించారు. సగటు సంపాదన 6.7 మిలియన్ డాలర్ల వరకు ఉంది. సౌతాఫ్రికాలో సీఈఓ జీతం గత ఏడాది 1.6 మిలియన్ ఉండగా, ఇండియాలో రెండు మిలియన్ డాలర్లు ఉంది. సీఈఓల వంటి పెద్దస్థాయి ఎగ్జిక్యూటివ్ల జీతాలు భారీగా పెరిగేలా విధానాలు ఉంటున్నాయని, వర్కర్ల జీతాలు అతి తక్కువగా పెరుగుతున్నాయని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్అన్నారు. ఇంటి అద్దె, ఆహారం, వైద్యం వంటి కనీస ఖర్చులు భరించలేక వర్కర్లు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. జీవన వ్యయానికి తగ్గట్టు సగటు ఉద్యోగుల జీతాలు పెరగడం లేదన్నారు.
పేరుకే పెరుగుదల...
అంతర్జాతీయ కార్మిక సంస్థ గత ఏడాదిలో నిజ వేతనాలు 2.7 శాతం పెరిగాయని ప్రకటించినా, వీటి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంది. ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, స్పెయిన్ వంటి దేశాలలో, గత సంవత్సరం నిజ వేతనాల పెరుగుదల కేవలం 0.6 శాతం మాత్రమే. ప్రపంచ వేతన అసమానత కొద్దిగానే తగ్గింది. తక్కువ-ఆదాయ దేశాలలోనూ, అత్యంత ధనవంతులైన 10 శాతం మంది 40 శాతం మంది పేదల కంటే 3.4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.
బిలియనీర్లు గత ఏడాది సగటున 206 బిలియన్ డాలర్లు సంపాదించారు. అంటే గంటకు 23,500 డాలర్లు. 2023లో ప్రపంచ సగటు వార్షిక ఆదాయం 21 వేల డాలర్ల కంటే ఎక్కువ. యూఎస్ టారిఫ్ల వల్ల కార్మికుల కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడమే గాక, అత్యవసర వస్తువుల ధరలూ పెరుగుతాయని ఆక్స్ఫామ్హెచ్చరించింది. ముఖ్యంగా వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని స్పష్టం చేసింది.