
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో ఎంతో మంది కరోనా బారిన పడి చనిపోతున్నారు. మరెంతో మంది ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరికి కొందరు దాతలు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగానే..కరోనా బాధితులకు సాయంగా కోలీవుడ్ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. తమిళనాడు ప్రభుత్వానికి అండగా పలువురు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తమవంతు సాయంగా కరోనా బాధితుల కోసం సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ విరాళం ఇచ్చింది. ఆమె భర్త విశాగన్ వనంగముడి, మామ ఎస్‌ఎస్ వనంగముడితో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్‌ను అందించింది. తమ ఫార్మా కంపెనీ అపెక్స్ లాబోరేటరీ నుంచి ఈ విరాళం అందించినట్లు ఆమె తెలిపింది.
ఇప్పటికే నటుడు సూర్య, కార్తీ, వారి తండ్రి, సీనియర్ నటుడు శివ కుమార్లు కలిసి సీఎం స్టాలిన్‌కు కోటి రూపాయల చెక్ విరాళంగా అందించారు. నటుడు అజిత్ కూడా రూ. 25 లక్షలు విరాళం ఇవ్వగా.. ప్రముఖ దర్శకుడు మురుగదాస్, హీరో ఉదయనిధి స్టాలిన్‌లు చేరో 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.