
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. ఎప్పటిలాగే చేపలు పడుతున్న జాలర్లకు 25 కిలోల బరువున్న భారీ చేప దొరకడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం (ఆగస్టు 25) తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ సంగంపల్లి గ్రామానికి చెందిన కూన సంపత్ అనే జాలరికి చిక్కింది ఈ భారీ చేప.
లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ)లో చేపలు పడుతుండగా వలకు భారీ సైజులో చేప చిక్కినట్లు జాలరి సంపత్ చెప్పాడు. ఎల్ఎండీలో చాలా సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నామని, కానీ ఎప్పుడు ఇంత పెద్ద చేప వలకు చిక్కలేదని సంతోషం వ్యక్తం చేశాడు సంపత్.
కడెం ప్రాజెక్టులో 34 కిలోల చేప
భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్ద పెద్ద చేపలు మత్స్యాకారుల వలకు చిక్కుతున్నాయి. జులై నెలలో కడెం ప్రాజెక్టులో కూడా ఇలాంటి భారీ చేప జాలర్లకు దొరికింది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌లో పెద్దూర్ గ్రామానికి చెందిన ముత్యం అనే మత్స్యకారుడికి 34.5 కిలోల బరువున్న బొచ్చె రకం చేప పడింది. ఈ భారీ చేపను చూసి మత్స్యకారులు, స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
►ALSO READ | లంకెబిందెల పేరుతో..వ్యాపారికి రూ. 20 లక్షలు టోకరా పెట్టిన కేటుగాళ్లు