
ప్రస్తుత డిజిటల్ యుగంలో రకరకాల మోసాలు బయటపడుతున్నాయి.ఈజీ మనీ కోసం జనానికి ఉన్న అత్యాశను ఆసరగా తీసుకుని కూర్చున్న చోటనే కోట్లు కొల్లగొడుతున్నారు కొందరు కేటుగాళ్లు. వాట్సప్, ఫేస్‌బుక్, ఎక్స్, టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్స్‌పై ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాట్సప్‌కు మెసేజ్‌లు, లింక్స్ పంపి సైబర్ నేరగాళ్లు అట్రాక్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్, వర్క్ ఫ్రమ్ హోం, ట్రేడింగ్, జాబ్, లోన్ ఫ్రాడ్స్ సహా పీఎం కిసాన్ యోజన, ముద్రా లోన్స్ పేరుతో ఆన్‌లైన్‌లో నకిలీ లింకులు పంపిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రాప్ చేసి, లింక్స్‌తో బ్యాంక్ అకౌంట్లను కొల్లగొడుతున్నారు.
ఇలా స్మార్ట్ గా కోట్లు కొల్లకొట్టే వాళ్లు కొందరైతే.. మరి కొందరు మనుషుల మూఢ నమ్మకాలు, అత్యాశ,సెంటిమెంట్ ను ఆసరగా తీసుకుని మాయమాటలు చెప్పి బురిడి కొట్టి నిండా ముంచుతున్నారు.
లేటెస్ట్ గా.. లంకెబిందెల పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ. 20 లక్షలు కాజేసిన ఘటన కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. లంకె బిందెల్లో బంగారు నాణేలు దొరికాయని హోటల్ యజమాని దగ్గరి నుంచి 20 లక్షల రూపాయలు కాజేశారు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నిందితుల నుంచి రూ. 13.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
►ALSO READ | లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన.. భద్రాద్రి కొత్తగూడెం అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్
ఎప్పుడో మన తాతల నాటి కాలంలో లంకె బిందెలున్నాయని చెపుతుంటే వింటుంటాం. పురాతన కాలంలో రాజులు లేదా పెద్దలు దాచిపెట్టిన సంపదను బిందెల్లో పెట్టే వారని చెబుతుంటారు. అలాంటి లంకె బిందెలు దొరికితే అదృష్టం వరిస్తుందని.. ధనవంతులవుతారని ఒక నమ్మకం. ఇప్పటికీ చాలా మంది లంకె బిందెల గురించి నమ్ముతుంటారు. లంకె బిందెలు దొరికితే ధనవంతులం అవుతారని పిచ్చినమ్మకంతో వెతుకుతుంటారు. అయితే ప్రస్తుత చట్టాల ప్రకారం భూమిలో దొరికిన నిధి ప్రభుత్వానికే చెందుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇటువంటి నిధి దొరికితే, దానిని ప్రభుత్వానికి అప్పగించాలి. ప్రభుత్వ నిధిని ప్రజలు తీసుకోవడం నేరమే అవుతుంది.