అన్ని మార్కెట్ల ఫండ్స్​తెచ్చి.. కోహెడ మార్కెట్ల పెట్టిన్రు

అన్ని మార్కెట్ల ఫండ్స్​తెచ్చి.. కోహెడ మార్కెట్ల పెట్టిన్రు
  • రాష్ట్రంలోని 70 మార్కెట్ల నుంచి రూ.350 కోట్ల మళ్లింపు
  • మూడేళ్ల తర్వాత తిరిగి చెల్లించేలా అగ్రిమెంట్​
  • సిద్దిపేట మార్కెట్ నిర్మాణంలోనూ అదే ఫార్ములా
  • పూర్తయ్యాక ఆదాయం లేదని లోన్లను రద్దు చేసిన ప్రభుత్వం

నల్గొండ/కామారెడ్డి, వెలుగు: హైదరాబాద్​ సిటీ శివారు రంగారెడ్డి జిల్లా కోహెడలో ఆధునిక ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మోడ్రన్​ఫ్రూట్​మార్కెట్ కోసం భారీగా నిధులు సేకరిస్తున్నారు. రాష్ట్రంలోని 70 మార్కెట్ కమిటీల నుంచి దాదాపు రూ.350 కోట్లు ట్రాన్స్​ఫర్ చేయాలని మార్కెట్​శాఖ అధికారులకు ఆర్డర్స్ వచ్చాయి. రాష్ట్రంలో ఎక్కడైనా వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తే అందుకు అవసరమయ్యే ఫండ్స్ ను వివిధ మార్కెట్​కమిటీల నుంచి సమీకరించుకోవచ్చని వ్యవసాయ మార్కెట్ యాక్ట్​చెబుతోంది. ఇందులో భాగంగానే కోహెడ మార్కెట్ నిర్మాణానికి వందల కోట్లు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మిగులు బడ్జెట్ తో ఉన్న పెద్ద మార్కెట్ల నుంచే గాక, కొద్దిపాటి ఆదాయం ఉన్న చిన్నవాటి నుంచి కూడా సమీకరించడం చర్చనీయాంశమైంది. 

మూడేళ్ల వరకు నో రిటర్న్

కోహెడ మార్కెట్​నిర్మాణం కోసం లోన్ల రూపంలో ఇతర మార్కెట్ల నుంచి ఫండ్స్​తీసుకొంటున్నట్లు జీఓలో పేర్కొన్నారు. మూడేండ్ల  వరకు రీ పేమెంట్స్, నామినల్​ఇంట్రస్ట్​చెల్లింపులు ఉండవని తెలిపారు. మూడేళ్ల తర్వాత కోహెడ మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాన్ని బట్టి అన్ని లోన్లను క్లియర్​చేస్తారు. అది కూడా నామినల్ వడ్డీ మాత్రమే. ఒకవేళ కోహెడలో అనుకున్నంత ఆదాయం రాకున్నా, మార్కెట్​నడవలేని పరిస్థితుల్లో ఉన్నా ఇతర మార్కెట్ల నుంచి తీసుకున్న అప్పులను ప్రభుత్వం రద్దు చేయొచ్చు.

సిద్దిపేటలోనూ ఇంతే..

హరీశ్​రావు మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2019లో సిద్దిపేటలో ఏడెకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్లతో పెద్ద మార్కెట్ నిర్మించారు. దీనికోసం రాష్ట్రంలోని వివిధ మార్కెట్ల నుంచి నిధులు సేకరించారు. కానీ అగ్రిమెంట్ ప్రకారం రీపేమెంట్స్ చేయలేదు. సిద్దిపేట మార్కెట్ నుంచి ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో ప్రభుత్వం రుణాలను మాఫీ చేసింది. కనీసం నామినల్ వడ్డీలు కూడా చెల్లించకపోవడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఎక్కడో నిర్మించే మార్కెట్లకు తమ నిధులు తరలించడం కంటే ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. 

కీలుబొమ్మలుగా మార్కెట్ ​కమిటీలు

మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించామని ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే.. అధికారికంగా ఎలాంటి పవర్స్​ఇవ్వట్లేదని పాలకవర్గాలు వాపోతున్నాయి. మార్కెట్​ఆదాయంతో గోదాంలు నిర్మించుకునే వెసులుబాటు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు బాగుచేయొచ్చు. ఉమ్మడి ఏపీలో మార్కెటింగ్​ ఫండ్స్​తో గ్రామీణ రోడ్లు, గోదాంలు నిర్మించారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మార్కెట్ కమిటీల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపినా ఉన్నతాధికారులు ఒప్పుకోవడం లేదు. గోదాంలు నిర్మించాక వాటి నుంచి ఆదాయం రాకుంటే మార్కెట్​సెక్రటరీలు, ఏడీలను బద్నాం చేస్తున్నారని కొందరు వాపోతున్నారు. దీంతోనే ఉద్యోగుల జీతాలకు సరిపడా బడ్జెట్​ట్రెజరీలో ఉంచి మిగిలిన మొత్తాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీశ్​​రావు ఎక్కడికి చెబితే అక్కడికి ట్రాన్స్​ఫర్​చేస్తున్నారు. జిల్లాలో మినరల్ ఫండ్స్, సీఎస్సార్ ఫండ్స్​తరహాలోనే మార్కెట్ల నిధులపైన కూడా పాలకవర్గాలకు పవర్స్ లేకుండా పోయాయి. పైసలు ఉన్నా పాలకవర్గాలు కీలుబొమ్ములు మారుతున్నాయి. తాము ప్రాతినిధ్యం వహించే గ్రామాలను, మార్కెట్లను డెవలప్ చేసుకోలేక పోతున్నామని డైరెక్టర్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. 

మొత్తం ఊడ్చేశారు

కోహెడ మార్కెట్ నిర్మాణంతో రాష్ట్రంలోని 70 మార్కెట్ల ఖజానాలు ఖాళీ అయ్యాయి. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వంటి పెద్ద మార్కెట్ మొదలు, మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, యాదాద్రి జిల్లాలోని వలిగొండ వంటి చిన్న మార్కెట్ల నుంచి కూడా ఫండ్స్​ట్రాన్స్ ఫర్ చేశారు. రూ.19 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఎంత వీలుంటే అంత లోన్​పేరుతో లాగేశారు. ఉద్యోగుల జీతాలు మినహా అదనంగా ఒక్కపైసా కూడా లేకుండా మొత్తం ఊడ్చేశారు. కొత్తగా ట్రేడింగ్ జరిగి ఆదాయం సమకూరితేనే మార్కెట్ల ఖజనా నిండేది.