శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం

శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం

శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆదాయం అదే స్థాయిలో పెరుగుతోంది. గత పది రోజుల్లోనే 52కోట్ల 55లక్షల ఆదాయం వచ్చిందని దేవస్వమ్  బోర్డు అధ్యక్షుడు అనంతగోపన్  తెలిపారు. గతేడాది కరోనాతో ఆలయానికి దాదాపు పది కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. ఆలయానికి వచ్చిన ఈ ఆదాయంలో మూడొంతులు ఉత్సవాల నిర్వహణకే ఖర్చు చేస్తామని దేవస్వం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. మండకాలం ప్రారంభం నుంచి అయ్యప్ప దీక్షాపరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఆన్ లైన్ , స్పాట్ బుకింగ్ ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు శబరిమల ఆలయ అధికారులు. సన్నిధానానికి వెళ్లేందుకు నాలుగు ద్వారాలను తెరిచామని, వీటి ద్వారా భక్తులు ఆలయానికి వెళ్లొచ్చని చెప్పారు. చలక్కాయం-పంబా రహదారిపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామని, కొండ ఎక్కే ప్రధాన మార్గంలో వచ్చేవారం వరకు పూర్తవుతాయని బోర్డు తెలిపింది. సన్నిధానం, పంపా, నిలక్కల్ దగ్గర అంతరాయం లేకుండా రోజుకు మూడుసార్లు అన్నదానాలు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు. అలాగే ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన భక్తులకు వైద్య సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. 210 మందికి అత్యవసర సేవలు అందించామని, 37 మందికి గుండెపోటు రాగా.. 30 మంది ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు.

శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులు రోజూ కనీసం అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలని సూచించారు అధికారులు. కొండ ఎక్కే సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. భిక్ష చేసిన వెంటనే కొండ ఎక్కవద్దని, నెమ్మదిగా ముందుకు వెళ్లాలని సూచించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, అలసట ఏవైనా శారీరక ఇబ్బందులుంటే ఆపి వేయాలని సూచించారు. పంపా, నీలిమల, అపాచెమేడు, సన్నిధానం ఆసుపత్రుల్లో కార్డియాలజిస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు శబరిమల అధికారులు.