ఆ దేశంలో పెట్రోల్ ధర మండుతోంది... ఎంతంటే...

ఆ దేశంలో పెట్రోల్ ధర  మండుతోంది... ఎంతంటే...

పెట్రోల్ మాట వింటేనే ఆదేశంలో జనాలు బెంబేలెత్తున్నాయి. పాకిస్థాన్ లో డబుల్ సెంచరీ దాటిన ధరతో సతమతమవుతున్న జనాలకు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ధరలు చాలవన్నట్లు ఇప్పుడు అమాంతంగా పెంచేసింది.  దీంతో బైక్ బయటకు తీయాలంటే జనాలు భయపడుతున్నారు.  

 ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ధరలు చాలవన్నట్లు మరోసారి అక్కడి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచేసింది. దివాలా అంచున ఉన్నపాకిస్థాన్.. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి బెయిలవుట్ ప్యాకేజీకోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ దేశానికి మూడు బిలియన్ డాలర్లు బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అనేక నిబంధనలు విధిస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను పెంచాలని సూచించింది.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర లీటర్ 253 రూపాయిలు ఉంది. డీజిల్ ధర  రూ. 253.50 పైసలుగా ఉంది. తాజాగా మరో లీటర్ పెట్రోల్ పై 19.95 పైసలు, డీజిల్ పై రూ. 19.90 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పెంపుతో పాకిస్థాన్‌లో ఇంధన ధరలు 273రూపాయిలకు చేరింది.  ఐఎంఎఫ్ సూచనల ప్రకారం లీటర్ పెట్రోల్‌పై రూ. 50 నుంచి 60 మేర పెంచాల్సి ఉంది. కానీ, మరికొద్ది నెలల్లో పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఐఎంఎఫ్ సూచించిన విధంగా ఇంధన ధరలు పెంచితే ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు 20 రూపాయిలమేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారనుంది. ఇంధన ధరల పెంపుపై పాకిస్థాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ..  పదిహేను రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయని, కానీ, అంతమేర పెంచకుండా సాధ్యమైనంత తక్కువగానే ఇంధన ధరలు పెంచామని తెలిపారు.