
నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి జిల్లాలో మద్యం షాపుల వేలానికి భారీ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. 336 షాపులకు 15,256 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు రానుండడంతో ఈసారి మద్యం దుకాణాల కోసం పెద్ద సంఖ్యలో టెండర్లు వేశారు.
రియల్టర్లు, రాజకీయ నాయకులు, వివిధ వ్యాపారులు ఈ టెండర్లలో పాల్గొన్నారు. రెండేళ్ల కింద (2021) మద్యం షాపుల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 336 షాపుల కోసం 8481 దరఖాస్తులు రాగా... ఈసారి మాత్రం అంతే సంఖ్యలో ఉన్న షాపుల కోసం 15,256 అప్లికేషన్లు వచ్చాయి.
ఇందులో నల్గొండ జిల్లాలో 155 షాపులకు 7037, సూర్యాపేట జిల్లాలో 99 షాపులకు 4250, యాదాద్రి జిల్లాలో 82 షాపులకు 3969 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కో అప్లికేషన్ కింద రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 305.12 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.