వివేక్ వెంకటస్వామిపై ఐటీ దాడులకు నిరసనగా చెన్నూరులో భారీ ర్యాలీ

వివేక్ వెంకటస్వామిపై ఐటీ దాడులకు నిరసనగా చెన్నూరులో భారీ ర్యాలీ


మాజీ ఎంపీ, చెన్నూరు అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివేక్ వెంకటస్వామిపై ఇన్ కం ట్యాక్స్ అధికారుల దాడులకు నిరసనగా.. చెన్నూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. నవంబర్ 21వ తేదీ ఉదయం నుంచి జరుగుతున్న తనిఖీలు.. రాజకీయ కక్షలో భాగం అని.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అధికార బీఆర్ఎస్ పార్టీ చేయిస్తుందంటూ ఆందోళనకు దిగారు. వేలాది మంది జనం ఈ ర్యాలీకి తరలిరావటంతో చెన్నూరు జన సంద్రం అయింది.  

చెన్నూరులో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న బాల్క సుమన్ అరాచకాలకు, అహంకారానికి ఇది పరాకాష్ఠ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఒక్క మంచి పని చేయలేదని.. ఇప్పుడు కూడా ప్రత్యర్థులపై కక్ష పూరితంగా దాడులకు పాల్పడుతున్నాడంటూ బాల్క సుమన్ తీరును ఖండించారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు.  బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీతో గళం విప్పారు చెన్నూరు నియోజకవర్గం జనం.

చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ర్యాలీ చేసిన జనం.. వివేక్ వెంకటస్వామి ఇంటికి తరలివచ్చారు. ఆయనకు సంఘీభావం తెలిపారు. వివేక్ వెంకటస్వామి వెంటే ఉంటామని.. ఆయనకు మద్దతు ఇస్తామని ఎలుగెత్తి చాటారు చెన్నూరు జనం.