తిరుమలలో వీకెండ్ రష్... బారులు తీరిన వెహికల్స్

తిరుమలలో వీకెండ్ రష్... బారులు తీరిన వెహికల్స్

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ప్రధానంగా వీకెండ్‌‌లో భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. వీకెండ్ కావడం, వేసవి సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. వాహనాల తనిఖీలు ఆలస్యం కావడంతో భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టోల్ గేట్ నుంచి గరుడ సర్కిల్ వరకు కిలో మీటర్ మేర వాహనాలు బారులు తీరాయి. 

భక్తుల రద్దీ కారణంగా.. స్వామి వారిని దర్శించుకోవడానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. దాదాపు 24 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూ లైన్ లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు టీటీడీ (TTD) చర్యలు చేపడుతోంది. వారికి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. శుక్రవారం స్వామి వారిని 71 వేల 119 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 91 లక్షలు వచ్చినట్లు తెలిపారు. 37 వేల 356 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 

మరోవైపు.. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాల టిక్కెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 13 లక్షల 35 వేల టికెట్లను విడుదల చేయగా....గంటలో 2 లక్షల 78 వేల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. ఇంకా 10 లక్షల 35 వేల టికెట్లు అందుబాటులో ఉన్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం : -

దేశంలో రెండో ఒమిక్రాన్ BA.4 కేసు.. ఎక్కడంటే


మంటలను ఆర్పేందుకు రోబోలు