
నిర్మల్ జిల్లా: కడెం ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో పరివాహక ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తుతామని.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదివరకు ప్రాజెక్టులో రెయిన్ ఫాల్ గేజ్ స్టేషన్లు లేకపోవడంతో వరద ఉధృతిని అధికారులు అంచనా వేయలేకపోయారు. వీటిని ఇప్పుడు నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు. వరద ఉధృతిని పక్కాగా లెక్కగట్టి దానికి అనుగుణంగా గేట్లను పైకెత్తుతూ దిగువకు నీరును విడుదల చేయనున్నారు. మందపల్లి వద్ద గల పలికేరు వాగుపై, కడెం నది తాటిగూడ వద్ద, చిక్ మాన్ వాగు, కుప్టి వాగు వద్ద ఈ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
గేజింగ్ స్టేషన్లకు సెన్సార్లను అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు వరద ఉధృతిని తెలుసుకుంటూ దానికి అనుగుణంగా ప్రాజెక్టు గేట్లను పైకెత్తి దిగువకు నీటిని వదలనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు కొత్తకళ సంతరించుకుంది. గతంలో జరిగిన వరద ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడెం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. కడెం ప్రాజెక్టుకు సంబంధించిన 18 గేట్లకు గతంలో మరమ్మతులు సక్రమంగా చేయకపోవడంతో పైనుంచి వచ్చే వరద పెరిగే సమయంలో గేట్లను పైకెత్తాలంటే ఇబ్బందులు ఏర్పడేవి.
ALSO READ : కేసీఆర్ పాలనలోనే నీటి వాటాలో తెలంగాణ అన్యాయం : మంత్రి ఉత్తమ్ కుమార్
గేట్లకు సంబంధించిన రెండు కౌంటర్ వెయిటర్లు, ఓ గేటు పూర్తిగా కొట్టుకుపోవడంతో ఇటు డ్యాంకు, అటు లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు తలెత్తేది. ఈసారి మొత్తం 18 గేట్ల మరమ్మతుల పనులు పూర్తి చేశారు. ఏటా అధికారులను ఇబ్బంది పెట్టే 15వ నంబర్ గేటును పూర్తిగా పునరుద్ధరించారు. అన్ని గేట్లకూ గ్రీసింగ్, ఆయిలింగ్పనులు పూర్తి కాగా, పైకెత్తేందుకు ఉపయోగించే గేర్లు, రోప్స్కు కార్డియమ్ కాంపౌండ్ను ఉపయోగించి మరమ్మతు చేశారు. అధికారులు రెండు నెలల నుంచి ఆయా ప్రత్యేక దృష్టి పెట్టి గడువులోగా పనులు పూర్తి చేశారు. ఈ గేట్ల కింది భాగంలో వరదకు కొట్టుకు వచ్చిన కలప, ఇతర చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.