HUL లాభం 1,848 కోట్లు

HUL లాభం 1,848 కోట్లు

క్యూ2లో 21.18 శాతం పెరుగుదల
అమ్మకాల విలువ
రూ.9,138 కోట్లు
పర్సనల్‌‌ కేర్‌‌ విభాగం
నుంచి రూ.4,543 కోట్లు

న్యూఢిల్లీ: ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్‌‌ యూనిలీవర్‌‌ (హెచ్‌‌యూఎల్‌‌) ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్‌‌లో రూ.1,848 కోట్ల లాభం సంపాదించింది. గత ఏడాది ఇవే క్వార్టర్‌‌లో వచ్చిన లాభం రూ.1,520 కోట్ల కంటే ఇది రూ.21.18 శాతం అధికం. హోమ్‌‌కేర్‌‌, బ్యూటీ, పర్సనల్‌‌ కేర్‌‌ వస్తువులు బాగా అమ్ముడవడంతో ఆదాయాలు పెరిగాయని హెచ్‌‌యూఎల్‌‌ తెలిపింది. స్టాండ్‌‌ఎలోన్‌‌ ప్రాతిపదికన తాజా క్వార్టర్‌‌లో అమ్మకాల విలువ రూ.9,708 కోట్లుగా రికార్డయింది.

గత సెప్టెంబరు క్వార్టర్‌‌లో వీటి విలువ రూ.9,138 కోట్లు. హోమ్‌‌కేర్‌‌ సెగ్మెంట్‌‌ రాబడి వార్షిక ప్రాతిపదికన రూ.3,080 కోట్ల నుంచి రూ.3,371 కోట్లకు పెరిగింది. బ్యూటీ అండ్‌‌ పర్సనల్‌‌ కేర్‌‌ విభాగాల నుంచి ఆదాయం రూ.4,316 కోట్ల నుంచి రూ.4,543 కోట్లకు ఎగిసింది. ఫుడ్‌‌ సెగ్మెంట్‌‌ రాబడి రూ.1,704 కోట్ల నుంచి రూ.1,847 కోట్లకు చేరింది. ఎఫ్‌‌ఎంసీజీ మార్కెట్లో ఎన్నో సవాళ్లు ఉన్నా మంచి ఫలితాలు సాధించామని, మార్జిన్‌‌ను పెంచుకోగలిగామని కంపెనీ సీఎండీ సంజీవ్‌‌ మెహతా అన్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో సమీప భవిష్యత్‌‌లో డిమాండ్‌‌ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే, ఒక్కో షేరుకు రూ.11 చొప్పున డివిడెండ్‌‌ చెల్లించడానికి హెచ్‌‌యూఎల్‌‌ బోర్డ్‌‌ అంగీకరించింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌‌యూఎల్‌‌ షేర్లు 0.50 శాతం పెరిగి రూ.2,041 వద్ద ముగిశాయి.