నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది సేవలు భేష్

నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది సేవలు భేష్
  • హాస్పిటల్ ను తనిఖీ చేసిన హెచ్చార్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య
  • ఆసుపత్రి సిబ్బందిపై ఒక్క రిమార్కు లేదంటూ కామెంట్

నల్గొండ జిల్లా:  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సేవలు అమోఘమని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్  చైర్మన్ జస్టిస్ చంద్రయ్య ప్రశంసించారు. సెప్టెంబర్ 16న చోటుచేసుకున్న గర్భిణి అఖిల మృతి ఘటనపై విచారణ చేపట్టేందకు ఆయన ఆసుపత్రికి వచ్చారు. అంతకు ముందు అఖిల మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన హెచ్చార్సీ చైర్మన్  జస్టిస్ చంద్రయ్య శనివారం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డిస్ట్రిక్ట్  ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి బి.ఎస్. జగ్జీవన్ కుమార్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత జస్టిస్ చంద్రయ్య అధికారులతో కలిసి హాస్పిటల్ ను తనిఖీ చేశారు.

అనంతరం ఆసుపత్రి సిబ్బందిపై జస్టిస్ చంద్రయ్య ప్రశంసలు కురిపించారు. ఆసుపత్రి సిబ్బంది పని తీరు బాగుందన్నారు. ఇక్కడి డాక్టర్లు దేవుళ్లలా కనిపిస్తున్నారని కితాబు ఇచ్చారు. వైద్యులు, ఇతర సిబ్బంది కొరత ఉందే తప్ప... అంతా బాగుందని మెచ్చుకున్నారు. హెచ్చార్సీ ఉంది ప్రతి ఒక్కరి హక్కులను కాపాడటం కోసమని, అందులో డాక్టర్లు కూడా ఉంటారని పేర్కొన్నారు. డాక్టర్లకు ఎలాంటి  ఇబ్బందులు కలిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. కాగా.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జస్టిస్ చంద్రయ్య వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. మృతురాలు అఖిల గురించి స్పందిస్తారనుకున్నామని, కానీ ఆయన ఆసుపత్రి సిబ్బందిని వెనకేసుకొచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీసం ఒక్కమాట కూడా అఖిల గురించి మాట్లాడకపోవడం విచారకరం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.