
- ఈ నెల 12 లోపు అన్ని రికార్డులతో హాజరు కావాలని సిటీ సీపీకి ఆదేశం
- నిమ్స్‌లో ట్రీట్మెంట్ అందించాలని సూపరింటెండెంట్‌కు ఆర్డర్స్
జూబ్లీహిల్స్/బషీర్‌బాగ్, వెలుగు: ఓ బాలుడి(17)పై జూబ్లీహిల్స్‌పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ బాలుడు రీల్స్తీసేందుకు వారు నివసిస్తున్న ఇంటిపైకి తన స్నేహితుడితో కలిసి వెళ్లి వీడియో తీస్తుండగా.. కింద ఉన్న ఒక బాత్రూం 5 సెకన్లు పాటు రికార్డు అయిందన్న ఆరోపణతో బాలుడిపై కేసు నమోదయింది.
దీంతో పోలీసులు 15 డిసెంబర్ 2024న బాలుడిను అదుపులోకి తీసుకొని మూడు రోజులు స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలు పెట్టినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతరం బయటకి వచ్చిన బాలుడు ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ నడవలేని స్థితికి చేరుకోవడంతో, పోలీసులు చిత్రహింసలు కారణంగానే తమ కొడుకు ఈ స్థితికి చేరుకున్నారని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు బాలుడి తండ్రి దగ్గుపాటి రాంబాబు ఫిర్యాదు చేశారు.
గురువారం ఈ కేసును పరిశీలించిన కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ నెల 12 తేదీలోపు ఈ ఘటనపై అన్ని రికార్డులతో కమిషన్ ముందు హాజరు కావాలని హైదారాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్‌ను ఆదేశించింది. అలాగే బాధిత బాలుడిని పరిశీలించి అత్యవసరమైన చికిత్సను వెంటనే అందించాలని నిమ్స్ సూపరిండెంట్‌ను కమిషన్ చైర్మన్ జిస్టిస్ షమీమ్ అక్తర్ ఆదేశించారు.