కాకిని బలిచ్చి.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ

కాకిని బలిచ్చి.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ

వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొందరు గుర్తుతెలియన దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లిపోయారు.  ఈ ఘటన 2024, ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్వామివారి ప్రతిష్టాపన మహోత్సవం జరిగిన వారంలోపే ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది.  శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి.. గుడి తలుపులు తెరిచి ఉండటం గమనించి.. ఆలయం లోపలికి వెళ్లి చూశారు. భక్తులు కానుకలు సమర్పించే హుండీని ఎత్తికెళ్లినట్లు గుర్తించి గ్రామాస్థులకు సమాచారం అందించారు పూజారి. 

ఆలయ దక్షిణ గేటు ముందు కాకి చనిపోయి కనిపించిందని.. దుండగులు ఏవో పూజలు చేసి కాకిని బలిచ్చి దొంగతనానికి పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారని పూజారి తెలిపారు. స్వామి బంగారు ఆభరణాలు ఉన్నాయని.. నగదును మాత్రమే అపహరించారని చెప్పారు. గ్రామాస్తుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీమ్ తో ఆలయానికి వచ్చిన పోలీసులు.. వివరాలు సేకరించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.