వందల స్కూళ్లు మూత! 

వందల స్కూళ్లు మూత! 
  • ఒకే కాంపౌండ్​లోని బడుల విలీనం 
  • టీచర్ల రేషనలైజేషన్​కు జీవో రిలీజ్
  • గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లకు వేర్వేరుగా ప్రాసెస్​​ 
  • 7 వేల పోస్టులు తగ్గిపోయే అవకాశం
  • ప్రతి స్కూల్​కు ఒక టీచర్​ను అలాట్ చేయాలని రూల్
  • గత ఏడాది లెక్కలతో రేషనలైజేషన్​ వద్దంటున్న యూనియన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ల సంఖ్యను తగ్గించాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఒకే కాంపౌండ్​లో కొనసాగుతున్న బడులను విలీనం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులను ఆదేశించింది. 2020–21 యూడైస్ లెక్కల ఆధారంగానే టీచర్ల రేషనలైజేషన్ చేపట్టాలని సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ సందీప్​కుమార్ సుల్తానియా జీవో నెంబర్ 25ను మంగళవారం విడుదల చేశారు. 

గవర్నమెంట్, లోకల్ బాడీ స్కూళ్లకు వేర్వేరుగా టీచర్ల రేషనలైజేషన్ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకే మీడియం, ఒకే కేటగిరీ స్కూళ్లను మాత్రమే విలీనం చేయాలన్నారు. దీంతో ఒకే కాంపౌండ్ లో వేర్వేరు పేర్లతో నడిచే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లను విలీనం చేయనున్నారు. ఉదాహరణకు ఒకే దగ్గర రెండు ప్రైమరీ స్కూళ్లు ఉంటే ఒక్కటి చేస్తారు. ప్రైమరీ, యూపీఎస్ ఉంటే.. యూపీఎస్ లో ప్రైమరీని విలీనం చేస్తారు. పీఎస్, యూపీఎస్, హైస్కూల్ ఉంటే.. యూపీఎస్​ను హైస్కూల్​లో విలీనం చేస్తారు. అయితే ఇలా బడులను కలిపేయడంతో వందల్లోనే స్కూళ్లు మూతపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 
పాత జీవోల ఆధారంగానే.. 
2015లో జరిగిన టీచర్ల రేషనలైజేషన్​ కోసం ఇచ్చిన జీవోలు 11, 17 ఆధారంగానే ప్రభుత్వం తాజాగా జీవో 25ని రిలీజ్ చేసింది. ప్రస్తుతం స్కూళ్లలోని శాంక్షన్డ్ పోస్టులు, అవసరమున్న పోస్టులు, ఖాళీల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా మేనేజ్మెంట్ల వారీగా ఎక్కువున్న పోస్టుల వివరాలనూ సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా అవసరమున్న స్కూళ్లకు టీచర్లను కేటాయించనున్నారు. కాగా, జీవోలో ప్రతి స్కూల్ కు ఒక టీచర్ ఉండాలనే రూల్ పెట్టారు. జీరో ఎన్​రోల్​మెంట్ స్కూళ్ల(1,300)కూ టీచర్లను కేటాయించి, వాళ్లను డిప్యుటేషన్ పై వేరే స్కూళ్లకు పంపనున్నారు. ప్రైమరీ స్కూళ్లలో 150 మందికి పైగా ఉన్న వాటికే ఎల్ఎఫ్​ఎల్ హెడ్మాస్టర్ పోస్టు కేటాయించనున్నారు. యూపీఎస్ స్కూళ్లలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్ హెడ్మాస్టర్​గా వ్యవహరిస్తారు. కాగా, టీచర్ల రేషనలైజేషన్​ను జిల్లా కలెక్టర్ చైర్మన్​గా, డీఈఓ సెక్రటరీగా ఉన్న కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు సర్కారు ప్రకటించింది. జిల్లాల్లో నిర్వహించే రేషనలైజేషన్​పై ఏవైనా అభ్యంతరాలుంటే స్కూల్ ఎడ్యుకేషన్​కు పది రోజుల్లోగా అప్పీల్ చేసుకునేందుకు అవకాశమిచ్చారు. 
పోయినేడాది లెక్కలపై అభ్యంతరం...   
టీచర్ల రేషనలైజేషన్ ను​పోయినేడాది యూడైస్ లెక్కల ప్రకారం చేపట్టనున్నట్లు సర్కార్ ప్రకటించింది. అయితే గతేడాది మొత్తం కూడా ఫిజికల్ క్లాసులు జరగలేదు. ప్రైమరీ స్కూళ్లు ఒక్కరోజు కూడా ఓపెన్​ కాలేదు. యూపీఎస్​, హైస్కూళ్లు కేవలం నెల రోజులే నడిచాయి. వివిధ సంక్షేమ హాస్టళ్లలో చదివే స్టూడెంట్లలో చాలామంది స్కూళ్లలో చేరలేదు. ఈ నేపథ్యంలో స్టూడెంట్ల సంఖ్యను ఎలా లెక్కగడతారని టీచర్ యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి. పోయినేడాది లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే, పెద్ద సంఖ్యలో టీచర్ పోస్టులు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమను, ఎమ్మెల్సీలను సంప్రదించకుండా సర్కార్ ఏకపక్షంగా రేషనలైజేషన్ ​గైడ్​లైన్స్ ఇవ్వడం  కరెక్టు కాదని మండిపడుతున్నాయి. 
7 వేల పోస్టులకు ఎసరు.. 
రేషనలైజేషన్​తో రాష్ట్రంలో దాదాపు 7 వేల వరకు టీచర్​ పోస్టులకు ఎసరు పడినట్టేననే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 1.08 లక్షల మంది టీచర్లు ఉండగా, శాంక్షన్డ్ పోస్టులతో పోలిస్తే 12,943 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. కేవలం ఎలిమెంటరీ ఎడ్యుకేషన్​లోనే 9,221 పోస్టులు ఎక్కువగా ఉన్నట్టు చెప్పింది. ఈ క్రమంలో రేషనలైజేషన్ తో ఎక్కువున్న పోస్టులను తగ్గించుకోవచ్చని సర్కారు భావిస్తోంది. ఆ తర్వాత మిగిలిపోయే దాదాపు 7 వేల పోస్టులను డీఈఓ పోల్​లో పెట్టే అవకాశముంది. 2015లోనూ 6 వేల పోస్టులను డీఈఓ పోల్​లో పెట్టిన విషయం తెలిసిందే.  
రేషనలైజేషన్ పై వ్యతిరేకత..  
గతేడాది లెక్కల ఆధారంగా టీచర్ల రేషనలైజేషన్ చేయడంపై టీచర్ యూనియన్లు మండిపడుతున్నాయి. 2020–21 యూడైస్ లెక్కలు ఫైనల్ కాలేదని, వాటిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని యూటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి ప్రశ్నించారు. ఫిజికల్ క్లాసులు ప్రారంభమై, అడ్మిషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాతే రేషనలైజేషన్ గురించి ఆలోచించాలని డిమాండ్ చేశారు. తప్పనిసరిగా రేషనలైజేషన్ చేయాలనుకుంటే, ఆగస్టు 31 వరకున్న స్టూడెంట్ల ఆధారంగా చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు, నవాత్ ​సురేశ్ ​కోరారు. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లను మూసివేసే ఆలోచనను మానుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, పర్వత్​రెడ్డి, డీటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షుడు రఘుశంకర్​రెడ్డి డిమాండ్ చేశారు. రేషనలైజేషన్​తో పాటు బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని టీఆర్​టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్, ధరావత్ రాములు కోరారు. ప్రైమరీ స్కూళ్లలో క్లాస్​రూమ్​కు ఒక టీచర్​ను కేటాయించాలని ఎస్జీటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్రుద్దీన్ డిమాండ్ చేశారు. రేషనలైజేషన్ నిబంధనలు మార్చాలని టీఎస్​టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్లా, రాజిరెడ్డి కోరారు. స్కూల్ ఎడ్యుకేషన్​ను ప్రక్షాళన చేసేలా రేషనలైజేషన్ చేపట్టాలని సెస్​చైర్మన్ నాగటి నారాయణ అన్నారు. జీవో నెంబర్ 25 సరిగా లేదని, దాన్ని నిలిపివేయాలని టీపీటీఎఫ్ ​రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణ, శ్రీనివాస్​ డిమాండ్ చేశారు.