హంగేరియన్ రచయిత లాస్లోకు సాహిత్య నోబెల్

హంగేరియన్ రచయిత లాస్లోకు సాహిత్య నోబెల్

స్టాక్​హోమ్ (స్వీడన్): నోబెల్ సాహిత్య పురస్కారం ఈ సారి హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కై(71)ను వరించింది. హంగేరీకి చెందిన లాసో స్థానిక స్థితిగతులకు అద్దం పట్టేలా ఎన్నో నవలలు రచించారు. ఆయన రచనల్లో తాత్వికతతోపాటు అంతర్లీనంగా హాస్యం ఉట్టిపడుతుంది. దీర్ఘదృష్టితో కూడిన లాస్లో రచనలు ఎందరినో కదిలించాయని, ఆయనను 2025 ఏడాదికి గాను నోబెల్ లిటరేచర్ అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు నోబెల్ కమిటీ గురువారం ప్రకటించింది. 

లాస్లో క్రాస్నాహోర్కై1954లో  హంగేరీలోని చిన్న గ్రామం గ్యులాలో జన్మించారు. గ్రామీణ ప్రాంత నేపథ్యంతో 1985లో ఆయన రాసిన ‘సటన్​టాంగో’ నవల ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జర్మనీలోని సామాజిక అశాంతికి అద్దంపడుతూ లాస్లో రాసిన మరో నవల ‘హెర్స్​ట్​ 07769’ కూడా విశేష ఆదరణ పొందింది. కాగా, సాహిత్యంలో నోబెల్ అవార్డులను ఇప్పటివరకు117 సార్లు కమిటీ ప్రకటించింది. నిరుడు దక్షిణ కొరియా రచయిత్రి హాన్​కాంగ్ ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు. 

నేడు నోబెల్ శాంతి బహుమతి ప్రకటన 

2025 ఏడాదికి గాను నోబెల్ పురస్కారాల జాబితాలో ఇప్పటివరకు మెడిసిన్, ఫిజిక్స్, కెమెస్ట్రీలో అవార్డులను ప్రకటించారు. సాహిత్య నోబెల్ నాలుగోది. శుక్రవారం నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించనున్నారు. సోమవారం ఆర్థికశాస్త్రంలో నోబెల్ అనౌన్స్ చేస్తారు. విజేతలకు డిసెంబర్ 10న ఆల్‌‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా అవార్డులను అందజేస్తారు. ఒక్కో అవార్డు కింద విజేతలకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ ల(రూ. 10.39 కోట్లు) నగదు బహుమతితోపాటు గోల్డ్ మెడల్ అందజేస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది విజేతలు ఉంటే.. వారందరికీ బహుమతి నగదు మొత్తాన్ని సమానంగా పంచుతారు.