
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న యాక్షన్ మూవీ 'హంట్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీకి మహేష్ సురపనేని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రీ–ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే టీజర్ తో పాటు ఒక పాటని కూడా లాంచ్ చేశారు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ సినిమా పేరు 'హంట్'పై పూర్తి రైట్స్ తమవే అంటూ శ్రీ క్రియేషన్స్ సభ్యులు మీడియా ముందుకొచ్చారు.. 'హంట్' (హొమిసైడ్ అన్ లాఫుల్ యాక్ట్ నేషనల్ టీమ్) మూవీ పేరుని శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై జులైలోనే రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. జులై18వ తేదిన రిజిష్ట్రేన్ చేస్తూ.. మూవీ పేరుకి సంబంధించిన పూర్తి హక్కులు శ్రీ క్రియేషన్స్ కే చెందుతున్నట్లు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆప్ కామర్స్ రిజిష్ట్రేషన్ లెటర్ ని కూడా అందించింది.
దీంతో శ్రీ క్రియేషన్స్ సభ్యులు నిర్మిస్తున్న ఓ మూవీకి 'హంట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. యంగ్ డైరెక్టర్ నిక్షిత్ తానే హీరోగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ–ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్ లో మోషన్ టీజర్ ని లాంచ్ చేశారు. తమకు రిజిష్ట్రేషన్ హక్కులు ఉన్నా.. తమ మూవీని మార్కెటింగ్ చేసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని శ్రీ క్రియేషన్స్ ప్రతినిథులు తెలిపారు.
సుధీర్ బాబు సినిమాకి హంట్ టైటిల్ పెట్టారని తెలిసిన వెంటనే తాము.. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిథుల్ని సంప్రదించామని శ్రీ క్రియేషన్స్ సభ్యులు తెలిపారు. దీనిపై మాట్లాడి చెప్తామని టైమ్ అడిగిన ఫిల్మ్ ఛాంబర్ అధికారులు.. తాము పదే పదే కలిసినా మళ్లీ తమకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదన్నారు. ఆ గ్యాప్ లోనే సుధీర్ బాబు సినిమాకి సంబంధించిన టీజర్ తో పాటు ఒక సాంగ్ ని కూడా లాంచ్ చేశారని శ్రీ క్రియేషన్స్ సభ్యలు చెప్పారు. ఎలాంటి రిజిష్ట్రేషన్ లేకుండా.. అంత పెద్ద బ్యానర్ లో ఈ మూవీ ఎలా తీస్తున్నారో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. న్యాయంగా రిజిష్ట్రేషన్ చేసుకున్న తమ టైటిల్ ని ఎవరికి ఇచ్చే ప్రసక్తే లేదని.. అవసరమైతే కోర్టుకి కూడా వెళ్తామన్నాంటున్నారు.
కాగా, ఈ ఇష్యూపై సుధీర్ బాబు టీమ్ ని సంప్రదించగా.. తమకు మూవీ టైటిల్ కి ఎలాంటి సంబంధంలేదన్నారు. మూవీ పేరు వేరే వాళ్లు రిజిష్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా తమకు తెలీదని.. తమ మూవీ ఆగస్ట్ చివరివారంలోనే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఇక సుధీర్ బాబు నటిస్తున్న ఈ మూవీ నవంబర్ 19వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే టైటిల్ మారుస్తారా లేక ఇదే పేరుతో రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.