ఐడా బీభత్సం..49కి చేరిన మృతులు

V6 Velugu Posted on Sep 05, 2021

న్యూయార్క్: ఐడా సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన అమెరికా ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. తుఫాన్​ ధాటికి శుక్రవారం నాటికే 49 మంది మృతి చెందగా.. ఆయా రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు తెలుస్తోంది. టోర్నడోల ధాటికి  న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, వెస్ట్​చెస్టర్, మేరీలాండ్​ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. న్యూయార్క్​లో ఆఫీసర్లు ఇంటింటికీ తిరుగుతూ.. ఎవరైనా గల్లంతయ్యారో లేదో వివరాలు సేకరిస్తున్నారు. వాతావరణం కొంత శాంతించినా ఆయా ప్రాంతాల్లో నదులు మాత్రం ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. నార్త్​ఈస్ట్​లో ఏడు నదులు రికార్డు స్థాయి నీటిమట్టానికి చేరుకున్నట్లు డార్ట్​మౌత్ కాలేజీ రీసెర్చర్ ఇవాన్ ​డెథియర్ ​తెలిపారు. న్యూయార్క్​లో ఒక గంటలోనే 7.5 సెంటీమీటర్ల వర్షం కురవడంతో  డ్రైనేజీ సామర్థ్యం సరిపోక ఇండ్లకు వరద పోటెత్తింది.

న్యూజెర్సీలో కనీసం 25 మంది వరకు చనిపోయారని ఆ రాష్ట్ర గవర్నర్ ​ఫిల్​మర్ఫి తెలిపారు. ఎలిజబెత్​లోని ఓ అపార్ట్​మెంట్​లో 4 మీటర్ల మేర నీరు నిలువడంతో ఓ ఫ్యామిలీ అందులో మునిగి ప్రాణాలు కోల్పోయిందని, గల్లంతైన వారు రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉంటారని మర్ఫి వెల్లడించారు. న్యూయార్క్ సబ్​వేలు ప్రారంభం కాలేదు. హడ్సన్ వ్యాలీలో ట్రాక్​పై అడుగుల మేర బురద పేరుకుపోయింది. వచ్చే వారానికైనా సేవలు అందుబాటులోకి వచ్చేలా లేవని మెట్రో-నార్త్ ప్రెసిడెంట్ కేథరీన్ రినాల్డి తెలిపారు. ఐడా ధాటికి లూసియానాలోని మిసిసిప్పి ఎలక్ట్రిక్​గ్రిడ్ ​ధ్వంసం కావడంతో 8 లక్షలకు పైగా ప్రజలు చీకటిలోనే గడిపారు. గత నాలుగేండ్లలో సంభవించిన తుఫాన్లలో ఐడా అత్యంత దారుణమైనదిగా నిలిచింది. ఫిలాడేల్ఫియాలో 1902 తర్వాత షుయ్​కిల్​ రివర్ అత్యధిక స్థాయిలో ప్రవహించడంతో క్రాస్‌‌‌‌స్టౌన్ వైన్ స్ట్రీట్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వే కొంత భాగం వరదతో నిండిపోయింది. వరద తగ్గాక రోడ్డుపై ఇంచ్​మందంతో బురద పేరుకుపోయింది. రెండు రోజుల్లో మేడ్ ఇన్ అమెరికా మ్యూజిక్ ఫెస్టివల్ ఉంది. దీని కోసం వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం కల్లా హైవేను పునరుద్ధరించనున్నట్లు అధికారులు చెప్పారు.

Tagged Hurricane Ida, Death 45 , four northeastern US states

Latest Videos

Subscribe Now

More News