ఇండ్లలోనే మునిగిపోయిండ్రు

ఇండ్లలోనే మునిగిపోయిండ్రు
  • ఒక ఇంటి బేస్​మెంట్​లో మునిగిపోయిన 11 మంది
  •  భారీ వర్షాలకు మొదటి అంతస్తు దాకా చేరిన వరద నీరు 
  •  లూసియానాలో బైడెన్​ పర్యటన.. ఆదుకుంటామని హామీ

న్యూయార్క్: అమెరికాలో హరికేన్​ఐడా వల్ల సంభవించిన వరదలు, టోర్నడోల ధాటికి 45 మంది చనిపోయారు. చాలా మంది ఇండ్లలోకి పోటెత్తిన వరదలోనే మునిగి మరణించారు. న్యూజెర్సీలో 23 మంది మృతిచెందారు. న్యూయార్క్​లో 13 మంది చనిపోతే.. అందులో 11 మంది ఇంటి బేస్​మెంట్​లోనే వరదలో మునిగిచనిపోయారు. పెన్సిల్వేనియాలో ఐదుగురు, వెస్ట్​చెస్టర్​లో ముగ్గురు మేరీలాండ్​లో ఒకరు మృతిచెందారు. వాన మొదలైన అరగంటలోనే వరద నీరు ఛాతి దాకా పెరిగిపోయిందని బాధితులు వెల్లడించారు. కొన్ని చోట్ల వరద నీరు అపార్ట్​మెంట్లలోని మొదటి అంతస్తు వరకు చేరిందని, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బయటపడ్డామని కన్నీరుమున్నీరయ్యారు. అయితే, ఇంతకుముందు కూడా ఇలాంటి తుఫాన్లు వచ్చినా.. ఇప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల తుఫాను ఇంత తీవ్రరూపంలో విరుచుకుపడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాతావరణం ఎంతగా వేడెక్కితే.. వానలు అంత ఎక్కువగా పడే ముప్పున్నట్టేనని హెచ్చరించారు. ఇంత పెద్ద వాన వస్తుందని అసలు ఊహించనేలేదని న్యూయార్క్​ గవర్నర్​ కేథీ హోచుల్​ అన్నారు. 
మీకు మేమున్నం: బైడెన్​
వరదలతో అతలాకుతలమై దిక్కుతోచని స్థితిలో ఉండిపోయిన ప్రజలకు అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ ధైర్యాన్నిచ్చారు. ‘మీ అందరికీ అండగా మేమున్నాం’ అంటూ హామీ ఇచ్చారు. దేశంలోని ప్రతి ఒక్కరు వాతావరణ మార్పుల వల్ల కలిగే చెడు పరిణామాలపై ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలని, తీవ్రమైన తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులను నియంత్రించేందుకు సహకారం అందించాలని సూచించారు. ఆయన వరద ప్రభావిత రాష్ట్రం లూసియానాలో పర్యటించనున్న నేపథ్యంలో వైట్​హౌస్​ నుంచి మెసేజ్​ను ఇచ్చారు. బాధితులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు కొంచెం ఎక్కువ నిధులు ఇస్తామని చెప్పారు. అయితే, ఎవ్వరినీ వదిలేయబోమని చెప్పారు. న్యూయార్క్​, న్యూజెర్సీల్లో ఇప్పుడు వచ్చిన భారీ వరదలతో పాటు ఇంతకుముందు జరిగిన కార్చిచ్చు ఘటనలన్నీ వాతావరణ మార్పుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్తాయని అన్నారు. కాబట్టి వాటిని ఎదుర్కొనేందుకు ఇప్పట్నుంచే సిద్ధం కావాల్సి ఉంటుందన్నారు.