- సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలో ఘటన
పుల్కల్, వెలుగు: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి గొడ్డలితో తన భార్య కాలిని నరికివేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని గంగోజిపేట గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పుల్కల్ ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం... గంగోజిపేట గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గయ్య ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. దుర్గయ్యకు భార్య వీరమణితో తరచూ గొడవలు జరుగుతుండేవి. బుధవారం తెల్లవారుజామున సైతం మరోసారి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన దుర్గయ్య గొడ్డలితో వీరమణి కాలిపై దాడి చేయడంతో కాలు పూర్తిగా విడిపోయింది.
అనంతరం కుడి చేయిని సైతం నరికేందుకు ప్రయత్నించాడు. సంగారెడ్డిలో ఉంటున్న వీరమణి కొడుకు హరీశ్‌కు విషయం తెలియడంతో అతడు వెంటనే గ్రామానికి చేరుకున్నాడు. స్పృహ కోల్పోయి పడి ఉన్న వీరమణిని సంగారెడ్డి ప్రభుత్వ హాస్సిటల్‌కు తరలించగా... మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. హరీశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
