సైదాపూర్, వెలుగు: భూ వివాదంలో ఓ వ్యక్తి తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లిలో జరిగింది. రాములపల్లి గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డితో కలపల్లికి చెందిన సుకృతకు 26 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కూతురు ఉంది. మహిపాల్‌రెడ్డి ఇదే గ్రామానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకోగా ఆమెకు ఇద్దరు పిల్లలు కలిగారు. దీంతో సుకృత తన కూతురితో కలిసి వేరుగా ఉంటోంది.
ఈ క్రమంలోనే గ్రామంలో పెద్ద మనుషుల పంచాయితీ పెట్టి మహిపాల్ రెడ్డికి ఉన్న భూమిలో 20 గుంటల భూమి మొదటి భార్య సుకృతకు ఇవ్వాలని ఒప్పించారు. వారి మాట ప్రకారం ఆ భూమిని ఇచ్చాడు. ఇటీవల సుకృత తన కూతురు వివాహం చేసి, ఆ భూమిని ఆమెకు రాసిచ్చింది. దీంతో కొన్ని రోజులుగా ఆ భూమిని తిరిగి తనకే ఇవ్వాలని మహిపాల్ రెడ్డి గొడవ చేస్తున్నాడు. శనివారం పొలం దగ్గరికి వెళ్లిన సుకృతను కొట్టి, పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
