రోడ్డు లేక తండాకు రాని 108.. గర్భిణిని 2 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

రోడ్డు లేక తండాకు రాని 108.. గర్భిణిని 2 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త
  • గర్భిణిని 2 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త సంగారెడ్డి జిల్లాలో ఘటన

నారాయణఖేడ్, వెలుగు : గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండడం, గ్రామానికి 108 వచ్చే పరిస్థితి లేకపోవడంతో తప్పని పరిస్థితిలో మహిళను భుజాలపై మోసుకుంటూ రెండు కిలోమీటర్లు నడక సాగించారు. మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో అక్కడే ప్రసవం చేశారు. తర్వాత మళ్లీ మోసుకుంటూ అంబులెన్స్‌‌ వరకు తీసుకొచ్చారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద మండలంలో ఆదివారం జరిగింది. మండలంలోని మున్యానాయక్‌‌ తండాకు చెందిన కౌసల్యాబాయికి ఆదివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు.

 తండాకు రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్‌‌ 2 కిలోమీటర్ల దూరంలోనే ఆగింది. దీంతో తప్పని పరిస్థితిలో కౌసల్యాబాయి భర్త వాసుదేవ్‌‌ ఆమెను చేతులపై ఎత్తుకొని అంబులెన్స్‌‌ వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు, 108 సిబ్బంది కలిసి అక్కడే ప్రసవం చేయగా ఆడపిల్లకు జన్మనిచ్చింది. తర్వాత మహిళ, చిన్నారిని 108 వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి కరాస్‌‌ గుత్తి ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు.