
బెంగళూరు: కర్నాటకలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలు ఊహించని మలుపు తీసుకున్నాయి. తన భర్త నపుంసకుడని, శోభనం రోజు నుంచి ఏ ఒక్క రోజు తనతో శృంగారం చేయలేదని ఆరోపించిన భార్య.. తన నుంచి 2 కోట్లు డిమాండ్ చేస్తుందని సదరు భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బెంగళూరు గోవిందరాజ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చిక్మగళూరుకు చెందిన ప్రవీణ్ బెంగళూరులోని గోవిందరాజ నగర్లో స్థిరపడ్డాడు.
చిక్మగళూరులోని తరికెరెకు చెందిన చందన అనే యువతితో మే 5, 2025న ప్రవీణ్కు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. బెంగళూరులోని సప్తగిరి ప్యాలెస్ దగ్గరలో కాపురం పెట్టారు. ప్రవీణ్ ఫస్ట్ నైట్ నుంచి భార్యతో శారీరకంగా కలవలేదు. దీంతో.. మెడికల్ టెస్టులు చేయించుకోవాలని, డాక్టర్కు చూపించుకోవాలని తన భార్య చందన కోరింది. భార్య చెప్పినట్టే ప్రవీణ్ మెడికల్ టెస్టులు చేయించుకున్నాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ప్రవీణ్ ఫిజికల్గా ఫిట్గానే ఉన్నాడని, నపుంసకుడు కాదని తేల్చారు.
అయితే.. మెంటల్ స్ట్రెస్ కారణంగా సెక్స్ పట్ల అనాసక్తి చూపుతుండొచ్చని, శృంగారం విషయంలో అతనికి కొంత సమయం ఇవ్వాలని చందనకు వైద్యులు సూచించారు. అయితే.. వైద్యుల సూచన పట్టించుకోకుండా తన భార్య చందన తాను నపుంసకుడని ప్రచారం చేస్తుందని, తన నుంచి 2 కోట్లు డిమాండ్ చేస్తుందని ప్రవీణ్ ఆరోపించాడు. ఈ ఇద్దరికీ పెళ్లయి మూడు నెలలయింది.
ఆగస్ట్ 17న చందన కుటుంబ సభ్యులు తన ఇంటికొచ్చి నానా రచ్చ చేశారని, తనను నోటికొచ్చి తిట్టారని ప్రవీణ్ తన కంప్లైంట్లో పేర్కొన్నాడు. ఈ గొడవంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఆ ఫుటేజ్లను కూడా పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు ప్రవీణ్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. చందన, ఆమె కుటుంబం కూడా ప్రవీణ్, అతని కుటుంబ సభ్యులపై కట్నం కోసం వేధిస్తున్నారని కేసు పెట్టింది.