అనుమానంతో పురుగుల మందు పోసి చంపిన భర్త

అనుమానంతో పురుగుల మందు పోసి చంపిన భర్త

యాదాద్రి, వెలుగు: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో భర్తే భార్యతో పురుగుల మందు తాగించి చంపేశాడు. సవతి తల్లి, మరో బంధువు సహకరించారు. కేసు వివరాలను డీసీపీ కె.నారాయణరెడ్డి గురువారం మీడియాకు వెల్లడించారు. భువనగిరి టౌన్​లోని తాతనగర్ చెందిన దేషగాని చంద్రశేఖర్, హేమలత భార్యాభర్తలు. పదేండ్ల కింద పెళ్లి కాగా కూతురు, కొడుకు ఉన్నారు. కొన్నిరోజులుగా హేమలత మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని చంద్రశేఖర్​ అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఈ నెల13న చంద్రశేఖర్.. తన అక్క భర్త రవి, అత్త వెంకటమ్మ(హేమలత సవతి తల్లి)ను పిలిపించి పంచాయితీ పెట్టాడు. ఈ సందర్భంగా హేమలత సీక్రెట్​గా వాడుతున్న ఫోన్​ను చూపించాలని భర్త ఒత్తిడి చేశాడు. దీంతో హేమలత మరోసారి తీవ్ర స్థాయిలో గొడవపడింది. అనుమానం నిజమేనని భావించిన ముగ్గురూ హేమలతను చంపేయాలని నిర్ణయించుకున్నారు. చంద్రశేఖర్ బయటికి వెళ్లి పురుగుల మందు కొనుక్కుని రాగా రవి, వెంకటమ్మ హేమలతను కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. భర్త బలవంతంగా భార్య గొంతులో పురుగుల మందు పోశాడు. కొద్దిసేపటి తర్వాత కూడా ఆమె చనిపోలేదని గమనించిన ముగ్గురూ గొంతుకు తాడు బిగించి చంపేశారు. ఆ తర్వాత ఫిట్స్​చనిపోయిందని నమ్మబలికారు. హడావుడిగా అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించగా మృతురాలి తండ్రి కోట దశరథ అడ్డుకున్నాడు. వెంకటమ్మ, చంద్రశేఖర్, రవిని నిలదీయడంతో అసలు విషయం వెల్లడించారు. దశరథ కంప్లైంట్​తో పోలీసులు డెడ్​బాడీకి పోస్టుమార్టం జరిపించారు. విచారణలో తామే హత్య చేసినట్లు ముగ్గురూ ఒప్పుకున్నారు. గురువారం నిందితులను రిమాండుకు తరలించినట్టు డీసీపీ తెలిపారు.