భార్య ఫోన్ కాల్​ రికార్డు చేయడం.. ప్రైవసీ హక్కు ఉల్లంఘనే: హైకోర్టు

భార్య ఫోన్ కాల్​ రికార్డు చేయడం.. ప్రైవసీ హక్కు ఉల్లంఘనే: హైకోర్టు

బిలాస్‌‌పూర్: అవతలి వ్యక్తికి తెలియకుండా మొబైల్‌‌ ఫోన్‌‌ సంభాషణను రికార్డు చేయడం.. ప్రైవసీ హక్కును ఉల్లంఘించడమేనని చత్తీస్‌‌గఢ్‌‌ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘తన భార్య ఫోన్ సంభాషణలను ఆమెకు తెలియకుండా భర్త రికార్డు చేయడం.. బాధితురాలి ప్రైవసీ హక్కును ఉల్లంఘించడమే. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విరుద్ధం’’ అని తేల్చిచెప్పింది. ఓ మహిళ వేసిన పిటిషన్‌‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తన నుంచి విడిపోయిన భర్త నుంచి భరణం ఇప్పించాలని కోరుతూ మహాసముంద్ జిల్లాలోని ఫ్యామిలీ కోర్టులో మహిళ 2019లో దరఖాస్తు చేసింది. 

అయితే తన భార్య మాట్లాడిన ఫోన్‌‌ రికార్డింగ్ తన వద్ద ఉందని, దాన్ని వినాలని, పిటిషనర్‌‌ను క్రాస్ ఎగ్జామిన్ చేయాలని ఫ్యామిలీ కోర్టును అతడు ఆశ్రయించాడు. అతడి విజ్ఞప్తికి 2021 అక్టోబర్ 21న కోర్టు ఓకే చెప్పింది. దీంతో ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ 2022లో హైకోర్టును మహిళ ఆశ్రయించింది.విచారణ సందర్భంగా మహిళ తరఫు లాయర్ వైభవ్ ఎ.గోవర్ధన్ వాదనలు వినిపిస్తూ.. ‘‘తన భార్య వ్యభిచారం చేసిందని.. ఫోన్ రికార్డింగుల ద్వారా నిరూపించాలని అతడు ప్రయత్నిస్తున్నాడు. తాను భరణం చెల్లించాల్సిన అవసరం లేదని వాదిస్తున్నాడు. అతడి విజ్ఞప్తికి అనుమతి ఇచ్చి చట్టపరంగా ఫ్యామిలీ కోర్టు తప్పిదం చేసింది. పిటిషనర్‌‌ గోప్యతకు భంగం వాటిల్లింది. ఆమెకు తెలియకుండా ఫోన్ కాల్స్‌‌ను భర్త రికార్డ్ చేశాడు. ఇప్పుడు దాన్ని తన భార్యకు వ్యతిరేకంగా ఉపయోగించాలనుకుంటున్నాడు” అని వివరించారు. దీంతో అతడి విజ్ఞప్తికి అనుమతిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది.