హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహ విద్యార్థులు నాణ్యత లేని భోజనం పెడుతున్నారని గురువారం అన్నం ప్లేట్లతో రోడ్డుపై బైఠాయించారు. చాలా కాలంగా హాస్టల్లో భోజనం సరిగ్గా ఉండడం లేదని వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. నీళ్ల చారు, ఉడకని అన్నంతో ఇబ్బందిపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిధులు ఇస్తున్నా తమకు నాణ్యమైన ఆహారం అందడం లేదని నినదించారు. విద్యార్థుల ఆందోళనకు బీఎస్పీ నాయకుడు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ సంఘీభావం తెలిపారు. పేద విద్యార్థుల కడుపు కొట్టడం సిగ్గుచేటని, మెనూ ప్రకారం భోజనం పెట్టకపోతే హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
