ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ సమీపంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న గుడిసె వాసుల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. మార్కెట్ అభివృద్ధి కోసం అక్కడి నివాసాలను ఖాళీ చేయాలని అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, నగర శివారులో ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించారు. అయితే, మార్కెట్‌లోనే కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, దూరంగా వెళ్తే ఉపాధి కోల్పోతామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో బుధవారం అధికారులు జేసీబీల సహాయంతో గుడిసెలను కూల్చివేయడంతో, పసిబిడ్డలతో సహా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. తమకున్న కొద్దిపాటి సామాన్లను మూటగట్టుకుని, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తమకు కనీస నీడ లేకుండా పోయిందని, దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.- వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం
