హుజూరాబాద్​ టీఆర్​ఎస్​ లీడర్ల ఒత్తిడితో ఎంబీలు చేయని ఆఫీసర్లు

హుజూరాబాద్​ టీఆర్​ఎస్​ లీడర్ల ఒత్తిడితో ఎంబీలు చేయని ఆఫీసర్లు
  • సెలవుల్లో ఉంటూ తప్పించుకుంటున్న ఆఫీసర్లు 
  • ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డే చేయిస్తున్నాడని ఆరోపణలు 
  • పట్టించుకోని పంచాయతీ రాజ్​శాఖ ఈఈ
  • కొత్త పనులపై ప్రభావం 

కరీంనగర్, వెలుగు: బీజేపీ సర్పంచులకు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయి. బీజేపీ లీడర్లు సర్పంచ్​లుగా ఉన్న గ్రామాల్లో అధికార పార్టీ లీడర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే బిల్లులు రాకుండా చేస్తూ ఎంబీలు, రికార్డులు కాకుండా చూస్తున్నరు. దీంతో అధికార పార్టీ లీడర్లు.. సర్పంచుల ఒత్తిడి తట్టుకోలేక పంచాయతీ రాజ్ ఏఈలు, డీఈలు సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు.  

75 లక్షలకు ఒక్క రూపాయి ఇవ్వలే

హుజూరాబాద్​ మండలం చెల్పూర్ పంచాయతీ సర్పంచ్ ​నేరెళ్ల మహేందర్  బీజేపీలో ఉన్నారు. ఇక్కడ ఎంపీపీ భర్త అధికార పార్టీలో ఉండగా..మహేందర్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చేయకూడదని.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా అధికారులకు చెప్పించినట్లు సమాచారం. దీంతో ఆరు నెలలుగా గ్రామంలో జరిగిన ఏ ఒక్క పనికి ఎంబీలు రికార్డు చేయలేదు. రూ. 60 లక్షల నిధులతో 22 సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు శ్మశానవాటిక దగ్గర రూ.12లక్షలతో కల్వర్టు నిర్మించారు. ఇందులో ఏ ఒక్క పనికీ ఎంబీలు రికార్డు చేయలేదు. అప్పు తెచ్చి పెట్టిన రూ.75 లక్షలకు రూపాయి కూడా ఇవ్వలేదు.  

సెలవులో ఆఫీసర్లు..  

హుజూరాబాద్ డివిజన్ లో పని చేసే పీఆర్ డీఈ ప్రకాశ్ రావు కొద్ది  రోజుల నుంచి సెలవులో ఉన్నారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనుల ఎంబీలు రికార్డు చేయాల్సి వస్తుందనే కారణంతోనే ఆయన సెలవులో ఉన్నట్టు తెలుస్తోంది. 15 రోజులు ఏఈ సెలవులో ఉంటే, మరో 15 రోజులు డీఈ లీవ్​ పెట్టి వెళ్తున్నారు. ఎవరైనా సర్పంచ్​లు వచ్చి ఎంబీలు రికార్డులు చేయాలని అడిగితే ఏఈ..డీఈపై.. డీఈ..ఏఈ మీద  చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, జమ్మికుంట డివిజన్ కు చెందిన డీఈ మహేశ్ ను కూడా అధికార పార్టీ నేతలు ఇబ్బంది పెట్టగా ఆయన కూడా 15  రోజుల నుంచి సెలవులో ఉన్నారు.. ఈ క్రమంలో చేసిన పనులకే ఎంబీలు రికార్డు చేయకపోవడంతో గ్రామాల్లో కొత్త పనులు చేపట్టేందుకు సర్పంచులు ఆసక్తి చూపడం లేదు. ఇంత జరుగుతున్నా జిల్లా పంచాయతీ రాజ్ ఈఈ మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడని సర్పంచులు ఆరోపిస్తున్నారు.  

కౌశిక్ రెడ్డి ఆపిస్తున్నారు

మా గ్రామ పంచాయతీలో సీసీ, డ్రెయిన్లు, కల్వర్టులు కట్టిన. ఇప్పటికే రూ.75లక్షల దాక ఖర్చు పెట్టి పనులు చేస్తే ఒక్క పనికి కూడా అధికారులు ఎంబీలు రికార్డు చేస్తలేరు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నరు. అధికారులు కూడా ఎక్కడ రికార్డులు చేయాల్సి వస్తుందోనని లీవులు పెట్టి వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మాకు బిల్లులు వచ్చేలా చూడాలి. లేకపోతే కోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధం. - నేరేళ్ల మహేందర్ గౌడ్ , చెల్పూర్ సర్పంచ్​, హుజూరాబాద్ మండలం  

పనులు ఆపేసినం

గతంలో గ్రామంలో చేపట్టిన అభివద్ధి పనులకే బిల్లులు వస్తలేవు. మండలంలో ఏ గ్రామంలో కూడా ఎంబీలు రికార్డులు చేస్తలేరు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రెయిన్లు కట్టడానికి ఆగస్టు నెలలో ఇసుక తెచ్చి పోసుకున్నం.  ఎక్కడన్నా అప్పులు తెచ్చి పనులు చేస్తం.. కానీ ఎంబీలు రికార్డు చేయకుండా బిల్లులు రాకుండా చేస్తే మా పరిస్థితి ఏంది? అందుకే పనులు మొదలుపెట్టలేదు. - బింగి కరుణాకర్, రంగాపూర్ సర్పంచ్​