బీదర్‌లో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య

బీదర్‌లో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య

జీడిమెట్ల, వెలుగు :  సిటీకి చెందిన ఓ బిల్డర్​బీదర్​లో దారుణ హత్య గురైన ఘటన మిస్టరీగా మారింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. కుత్బుల్లాపూర్​ డివిజన్ ​పద్మానగర్​ ఫేజ్–-1కు చెందిన కుప్పాల మధు బిల్డర్. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మధు ఇంటికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు తమతో బయటకు తీసుకెళ్లారు. అనంతరం అతడు కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి బీదర్​ వెళ్తున్నానని చెప్పాడు.  అదే రోజు రాత్రి మళ్లీ ఫోన్​చేసి తను ఇంటికి వస్తున్నానని భార్యకు తెలిపాడు. కాగా.. శనివారం ఉదయం అక్కడ దారుణ హత్యకు గురైన మధు డెడ్ బాడీ అనుమానాస్పదంగా రోడ్డు పక్కన పడి ఉండగా పశువుల కాపరి చూసి బీదర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పోలీసులు వెళ్లి కేసు నమోదు చేశారు. అయితే.. మధును కత్తులతో పొడిచి, ముఖంపై బండరాయితో కొట్టి హత్య చేసినట్టు బంధువులు పేర్కొంటున్నారు. అతని  వద్ద ఉన్న రూ.5 లక్షల నగదు, ఒంటిపై ఉన్న సుమారు రూ.15 లక్షల విలువైన బంగారం దోచుకెళ్లినట్టు తెలిపారు. మధు హత్య ఎలా జరిగింది ? వెంట వెళ్లిన ఫ్రెండ్సే చంపేసి  నగదు, గోల్డ్ తీసుకుని పారిపోయారా..? అనే కోణంలో బీదర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. అతడిని తీసుకెళ్లిన ముగ్గురి ఫోన్లు స్విచ్​ఆఫ్​ ఉండగా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.