అర్ధాంతరంగా నిలిచిపోయిన కార్‌ రేసింగ్ లీగ్‌

అర్ధాంతరంగా నిలిచిపోయిన కార్‌ రేసింగ్ లీగ్‌

సాంకేతిక కారణాల వల్ల హైదరాబాద్​ వేదికగా జరుగుతున్న  ఇండియా కార్​ రేసింగ్​ లీగ్​ అర్ధాంతరంగా నిలిచిపోయింది. నిన్న (శనివారం) టెస్ట్​ రేసులు సజావుగానే జరగగా.. ఇవాళ (ఆదివారం) రేసర్లకు వరుస ప్రమాదాలు జరిగాయి. దీంతో పూర్తి స్థాయిలో రేస్​ లు నిర్వహించలేకపోయారు. క్వాలిఫయింగ్​ రేసులో కొత్త ట్రాక్​ పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి. ఈనేపథ్యంలో లీగ్​ నిర్వహణను ఆపేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వరుస ప్రమాదాలపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.  కొత్త ట్రాక్ పై అలవాటు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ట్రాక్ సరిగ్గా లేకపోవడంతో ఫార్ములా-3 రేస్ రద్దు చేసి.. ఫార్ములా-4 రేస్ తో సరిపెట్టారు.  ఈ అనూహ్య నిర్ణయంతో ఆదివారం వేళ ఇంటర్నేషనల్ ఈవెంట్ చూద్దామని వచ్చిన  ఎంతోమంది అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. 
 
క్వాలిఫైయింగ్ రేసులో చెన్నై టీమ్ కు చెందిన రేసర్ కు గాయాలయ్యాయి. తర్వాత ఫార్ములా-4 రేసింగ్ లోనూ యాక్సిడెంట్ జరిగింది. టర్నింగ్స్ దగ్గర స్పీడ్ కంట్రోల్ తప్పడంతో ప్రమాదం జరిగింది. ఒక టర్నింగ్ దగ్గర మూడు కార్లు ఢీకొన్నాయి. దీంతో రేసింగ్ కు కాసేపు అంతరాయం ఏర్పడింది. కొంత గ్యాప్ తర్వాత ఫార్ములా-4 రేసు పోటీలు జరిపారు. లైటింగ్ తగ్గడంతో..  ఫార్ములా -3 రేస్ క్వాలిఫయింగ్ జరపకుండానే లీగ్ ను ముగించారు.