నాన్స్టాప్ వాన.. హైదరాబాద్ సిటీలో మొంథా ఎఫెక్ట్

నాన్స్టాప్ వాన.. హైదరాబాద్ సిటీలో మొంథా ఎఫెక్ట్
  •  హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్
  • పంజాగుట్ట, బేగంపేట, దిల్​సుఖ్​నగర్​లోనూ సేమ్ ​సీన్
  • ముషీరాబాద్​లో అత్యధికంగా 4.33 సెంటిమీటర్ల వర్షం

హైదరాబాద్ సిటీ/మాదాపూర్, వెలుగు:  మొంథా తుఫాన్ ప్రభావంతో రెండురోజులుగా సిటీలో నాన్​స్టాప్ వర్షం పడుతోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు వర్షం పడడంతో ఉదయం, సాయంత్రం  ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే వారు, తిరిగి వచ్చేవారికి  ఇబ్బందులు పడ్డారు. చిన్న గోల్కొండ వద్ద ఔటర్ రింగ్ రోడ్ అండ్ పాస్ కింద స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకోగా, క్రేన్ సహాయంతో బయటకు తీశారు. 

ఐటీ ఐరిడార్ లో ఉదయం నుంచి రాత్రి వరకు ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మైండ్ స్పేస్ నుంచి బయో డైవర్సిటీ రూట్ లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అటు హైటెక్ సిటీ నుంచి మాదాపూర్, కూకట్ పల్లి మార్గాలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ఇటు పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్ పేట్, మెహిదీపట్నం, నానల్ నగర్ ప్రాంతాల్లో గంటల తరబడి వాహనదారులకు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ ట్రాఫిక్ జామ్​ ఏర్పడకుండా సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు సాయంత్రం 3 గంటల నుందే దశల వారిగా లాగౌట్​ చేయించారు. 

 మరో రెండ్రోజులు మోస్తరు వర్షాలు 

మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8–30 గంటల వరకు అత్యధికంగా షేక్ పేటలో 4.45 సెంటిమీటర్లు, గచ్చిబౌలిలో  4.45 సెంటిమీటర్ల వాన పడింది. బుధవారం ఉదయం 8–30 గంటల నుంచి సాయంత్రం 7  గంటల వరకు అత్యధికంగా ముషీరాబాద్​లో  4.33, మారేడ్ పల్లి 4.00, ఓయూ 3.93, చార్మినార్ 3.78 సెం.మీ. వాన పడింది. మరో రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఫీల్డ్​లో జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు  

లక్డికాపూల్ ప‌‌రిస‌‌ర ప్రాంతాల‌‌ను బుధవారం హైడ్రా, జీహెచ్ఎంసీ క‌‌మిష‌‌న‌‌ర్లు ఆర్వీ క‌‌ర్ణన్, ఏవీ రంగ‌‌నాథ్ కలిసి ప‌‌రిశీలించారు. మాస‌‌బ్ ట్యాంక్ నుంచి లక్డికాపూల్ వైపు వచ్చే మార్గంలో మెహ‌‌దీ ఫంక్షన్ హాల్ వద్ద వ‌‌ర్షపు నీరు రోడ్డుపై నిల‌‌వ‌‌డానికి కార‌‌ణాల‌‌ను తెలుసుకున్నారు. ఇక్కడ తీవ్ర ట్రాఫిక్ స‌‌మ‌‌స్య త‌‌లెత్తుతున్నట్లు గుర్తించి.. స‌‌మ‌‌స్యను ప‌‌రిష్కరించాల‌‌ని అధికారుల‌‌ను ఆదేశించారు. 

ఇప్పటికే ఇక్కడ ఇరువైపులా రోడ్డును త‌‌వ్వి రెండు ఫీట్ల పైపులైన్లను వేశామ‌‌ని, వాటికి మ‌‌హ‌‌వీర్ ఆసుప‌‌త్రి ప‌‌రిస‌‌రాలతో పాటు చింత‌‌ల‌‌బ‌‌స్తీ  ప్రాంతాల నుంచి వ‌‌చ్చిన మురుగు, వ‌‌ర‌‌ద నీటిని లింక్​ చేయాల్సిన అవ‌‌స‌‌రం ఉంద‌‌ని అధికారులు వివరించారు. కమిషనర్ల వెంట హైడ్రా అడిషనల్ డైరక్టర్  వ‌‌ర్ల పాప‌‌య్య,  ట్రాఫిక్ డీసీపీ శ్రీ‌‌నివాస్ తదితరులు ఉన్నారు. 

అత్యవసరమైతేనే బయటకు రావాలి: మంత్రి పొన్నం 

మొంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ఎక్కడ ఇబ్బందులు ఉన్న  అధికారుల దృష్టికి తీసుకోవాలని తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఎ, వాటర్ బోర్డు, పోలీస్, విద్యుత్, హైడ్రా అధికారులు సమన్వయం చేసుకొని సహాయక చర్యలు అందించాలన్నారు.

 ఫిర్యాదులు  వస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీరు నిల్వ ఉండకుండా పర్యవేక్షించాలన్నారు.  విద్యుత్ స్థంబాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు అధికారులు  అప్రమత్తంగా ఉండాలని  సూచించారు. 

మూసారాంబాగ్ వద్ద ప్రమాదకరంగా రాకపోకలు 

జంటజలాశయాల గేట్లు ఎత్తడంతో  మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు. ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద ప్రవాహం పెరిగింది. ఇప్పటికే ఈ బ్రిడ్జి కోతకు గురికావడంతో అధికారులు రాకపోకలు బంద్ చేసిన సంగతి తెలిసిందే. బ్రిడ్జి కూల్చివేత పనులను కూడా జీహెచ్ఎంసీ ప్రారంభించినప్పటికీ స్థానికులు అడ్డుకోవడంతో నిలిచాయి. ప్రస్తుతం వాహనాలు వెళ్లేందుకు వీలు లేనప్పటికీ  పాదాచారులు మాత్రం ప్రమాదకరంగా అటు ఇటు దాడుతున్నారు. ఒక్కసారిగా ఫ్లో పెరిగితే ప్రమాదం జరిగే చాన్స్ ఉందని అధికారులు అంటున్నారు.