
- ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులకు నరకం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కుండపోత వర్షం పడింది. ఆకాశానికి గండి పడిందా అన్నట్టుగా గ్రేటర్ వ్యాప్తంగా ఏకధాటిగా వర్షం దంచికొట్టింది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 13.7 సెంటీమీటర్ల వాన పడింది. దారులన్నీ ఏరులై పారడంతో ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు నరకం చూశారు.
పలు చోట్ల బండ్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద చేరింది. సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్లోని కేశవ్ నగర్లో రెండు చెట్లు రోడ్డుపై కూలడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మణికొండలో ఓ కారుపై ప్రహారీ కూలింది. వర్షం కారణంగా మెట్రో స్టేషన్లలో రద్దీ నెలకొంది.
అధికారులకు సెలవులు రద్దు
అధిక వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన రెవెన్యూ సిబ్బంది, అధికారుల సెలవులను రద్దు చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇండ్లలో నీళ్లు రావడం, ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ సమస్యలు ఉంటే 040–2302813, 7416687878 కు కాల్ చేయాలని కోరారు.
అలాగే, వాటర్‌బోర్డు సిబ్బందికి మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేస్తున్నట్టు ఎండీ అశోక్‌రెడ్డి ప్రకటించారు. ఓవర్‌ఫ్లో అవుతుందని మ్యాన్‌హోల్స్ తెరవకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఇన్ స్పెక్షన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఫీల్డ్‌లోకి అధికారులు, సిబ్బంది..
భారీ వర్షం, ట్రాఫిక్ జామ్‌తో ట్రాఫిక్ పోలీసులు, బల్దియా, హైడ్రా, వాటర్‌బోర్డు టీమ్స్ రంగంలోకి దిగాయి. నీళ్లు నిలిచిన చోట్లకు వెళ్లి నీటిని తొలగించారు. బంజారా నాలా వద్ద మేయర్ విజయలక్ష్మి పరిస్థితిని పరిశీలించారు. నాలా చుట్టు బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెగి పడిన తీగలు.. పవర్ కట్
హైదరాబాద్, వెలుగు: జడివానకు పలు ప్రాంతాల్లోని 43, 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్, సైబర్ సిటీ, రాజేంద్రనగర్ , సరూర్‌నగర్, హబ్సిగూడ, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి కరెంటు సరఫరాకు ఇబ్బంది ఏర్పడిందని సదరన్ డిస్కం సీఎండీ వెల్లడించారు. దీంతో విద్యుత్ సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగి చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
హిమాయత్‌సాగర్ గేట్ ఓపెన్
- జంట జలాశయాలకు భారీగా వరద
హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద చేరడంతో ఫుల్ట్యాంక్ లెవెల్‌కు చేరుకున్నాయి. దీంతో గురువారం రాత్రి 10గంటలకు హిమాయత్ సాగర్ ఒక గేట్‌ను ఫీట్వరకూ ఎత్తారు.
పెరుగుతున్న వరదను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని గేట్లు ఎత్తే విషయాన్ని ఆలోచిస్తామని వాటర్‌బోర్డు అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్ ఫుల్ట్యాంక్ లెవెల్1763.50 అడుగులు కాగా ఇప్పటికే 1762.80 ఫీట్లకు చేరుకుందని అధికారులు తెలిపారు. ఉస్మాన్సాగర్ఫుల్ట్యాంక్లెవెల్1790.00 అడుగులు కాగా, ప్రస్తుతం 1782.90 అడుగులకు చేరుకుంది.